ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 6 : ఓ రైస్ మిల్లు యజమాని నుంచి రూ. 75 వేల లంచం తీసుకుంటున్న పౌరసరఫరాల శాఖ డీఎంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని వాసవీ మోడ్రన్ రైస్ మిల్లుకు చెందిన సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఒకో లారీకి రూ.25 వేల చొప్పున లంచం ఇవ్వాలని యజమాని సందీప్‌ను డీఎం నర్సింగరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రెబ్బెన మండలం ఖైర్గాం వద్ద బాధితుడు సందీప్ నుంచి డీఎం నర్సింగరావు మూడు లారీలకు సంబంధించి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నర్సింగరావుతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బాధితుడి నుంచి 16 లారీలకు సంబంధించిన డబ్బులు పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.