దుండిగల్, నవంబర్ 6: మేడ్చల్ మల్కాజిరిగి జిల్లా సూరారంలోని కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం 2:45 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 9 గంటలు దాటినా కొనసాగాయి. ఈ సోదాల్లో ఇటీవల జరిపిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను సేకరించినట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డాక్యుమెంట్ రైటర్స్‌ను విచారించారు.
ఓ వ్యక్తి వద్ద రూ.10వేలు మాత్రమే లభించడంతో వాటి గురించి ఆరాతీస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్‌పై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టామని తెలిపారు. పక్కా సమాచారంతో అవినీతి అధికారులను పట్టుకునే ఏసీబీ అధికారులు.. ఆకస్మిక తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 26న ‘పైసలు కొట్టు రిజిస్ట్రేషన్ పట్టు’ శీర్షికతో నమస్తే తెలంగాణ పత్రికలో కథనం ప్రచురించింది. ఇంటిపన్ను రసీదుల ఆధారంగా జరుగుతున్న అడ్డగోలు రిజిస్ట్రేన్లను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఏసీబీ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.