బెంగళూరు, ఫిబ్రవరి 27: కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు మరింత ఉధృతమైంది. ఓ హోటల్లో సమావేశమైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు.. తమ నాయకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. శివకుమార్ అనుచరుడు, మగది ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఓ హోటల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని, శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లాబీయింగ్ చేయాలని నిర్ణయించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఇదేవిధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలవడం అసాధ్యం.
నాయకత్వ మార్పిడి విషయమై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాం’ అని వెల్లడించారు. ‘హైకమాండ్ నిద్రపోవడం లేదు.. కర్ణాటకలో ఏం జరుగుతున్నదో వారికి అన్నీ తెలుసు’ అని అన్నారు. తమ నియోజకవర్గాలలోని ప్రజలు, కార్యకర్తలు రాష్ట్రంలో నాయకత్వం మార్పిడిని కోరుకుంటున్నారని చెప్పారు. ‘సీఎంను మారుస్తారా? లేక పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారా అన్నది హైకమాండ్ ఇష్టం. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం చెప్పలేదా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ గందరగోళానికి తెరదించాలి’ అని స్పష్టంచేశారు.