Telangana | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో నిర్మాణ రంగం సత్తెనాశ్ అయ్యింది. కొన్ని నెలలుగా ఇండ్లు కొనేవారు లేరు. వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి చట్టబద్ధమైన సంస్థల అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూడా హైడ్రా పేరుతో కూలగొట్టించారు. ఒకప్పుడు లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టులకు డిమాండ్ ఉండేది. లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టులకు గతంలో అడ్వాన్స్‌లు ఇచ్చిన వారు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. దేశంలో హైదరాబాద్ క్రెడాయ్‌కి మంచి పేరుండేది. హైదరాబాద్ రియల్ఎస్టేట్పై సానుకూలత ఉండేది. ఇప్పుడంతా నెగటివ్‌గా మారిపోయింది. మమ్మల్ని దొంగల్లా చిత్రీకరిస్తున్నారు. ఇదేం పద్ధతి..?’ అంటూ సుమారు 30 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి క్రెడాయ్ సహా వివిధ నిర్మాణరంగ సంస్థల, సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. సచివాలయంలో బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డీటీసీపీ దేవేందర్‌రెడ్డి, క్రెడాయ్ జాతీయ నేత శేఖర్‌రెడ్డి, సీ ప్రభాకర్‌రావు, జగన్నాథరావు, మారం సతీశ్, రాజశేఖర్‌రెడ్డి, విజయ్‌కుమార్, వర్టెక్స్ వర్మ, వేణువినోద్ సహా నిర్మాణరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు గంటలపాటు సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. హాజరైన ప్రతి సభ్యుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెల్సింది.
గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి
నిర్మాణరంగంలో 30 ఏండ్లకుపైగా ఉన్న తమకు ఇప్పుడు గడ్డు పరిస్థితులు వచ్చాయని పలువురు బిల్డర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్మాణ సంస్థలకు సంబంధించిన అనుమతులను ఇవ్వడంలో అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, ఇలాగైతే రాష్ట్రంలో వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడుతూ.. ‘ఉప్పల్ భగాయత్‌లో నేను హెచ్ఎండీఏ వేసిన లేఅవుట్లో భూమిని వేలంపాటలో ఓపెన్మార్కట్లోనే కొన్నా ను. అక్కడ నిర్మాణాల కోసం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు దరఖాస్తు ఇచ్చాను. ఆరునెలలుదాటినా ఇప్పటివరకు నా నిర్మాణాలకు అనుమతులు రాలేదు. ఎందుకు ఇవ్వడంలేదన్నదానిపై సమాధా నం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉ న్నాను. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు చేశాను. హైదరాబాద్‌లో 30 ఏండ్లుగా వ్యాపారం చేస్తున్నా. వైట్మనీతో ప్రభుత్వం నుంచి కొనుక్కు న్న భూమి విషయంలోనే మీరు ఇట్లా చేస్తే.. చిన్నాచితక బిల్డర్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి’ అని అన్నట్టు సమాచారం. ‘పర్మిషన్లు మాత్రమే కా దు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ)ల జారీలో ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణాలు పూర్తిచేసుకున్నవాటికి ఓసీలు ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నాం. మిగతా ప్రాజెక్టులు చేయలేకపోతున్నాం’ అని అన్నట్టు తెల్సింది.
హైడ్రాతో నిద్ర కరువైంది
మరో బిల్డర్ మాట్లాడుతూ ‘మేము మూడునెలల నుంచి నిద్ర కూడా పోతలేము. భయంగా ఉన్నది. ఎప్పుడు ఎవరు నోటీసు ఇస్తారో అని చూస్తున్నాము. అన్ని పర్మిషన్లు తీసుకున్నా భయంతోనే బతుకాల్సి వస్తున్నది. నా ఒక్కడి పరిస్థితే కాదు.. ఇండస్ట్రీ ఇట్లాగే ఉన్నది. నిద్ర కూడా పట్టడంలేదు. అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా నిర్మాణాలను కూలగొడుతున్నారు. కస్టమర్ల ముందు మమ్మల్ని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో హైడ్రా గొప్పది.. రియల్ ఎస్టేట్ వాళ్లదే తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మాపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మేము ఎంతో శ్రమకోర్చి కస్టమర్ల కోసం కట్టినవాటిని అక్రమ నిర్మాణాలంటూ ప్రభుత్వం నుంచే లీకులు ఇస్తున్నారు..’ అని తమ ఆవేదనను వ్యక్తం చేసినట్టు తెల్సింది. ప్రభుత్వం, కొంతమంది అధికారులకు అవగాహన లేకపోవడం తమ నెత్తిమీదకు సమస్యలను తెచ్చిపెడుతున్నదని కొందరు బిల్డర్లు అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మహత్యలను సైతం చూస్తారంటూ గద్గద స్వరంతో భట్టి, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో చెప్పినట్టు సమాచారం.
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించండి
సమావేశానికి హాజరైన క్రెడాయ్ సహా పలు రియల్ ఎస్టేట్ రంగ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నడూలేనివిధంగా రియల్ రంగం కుదేలయ్యిందని, దీనికి జవసత్వాలు నింపాలంటే ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని కోరారు. స్టాంప్ డ్యూటీని తగ్గించాలని, హైడ్రా పేరుతో అనుమతులున్న నిర్మాణాలను కూల్చడాన్ని ఆపాలని, నిర్మాణరంగంలో విశ్వాసాన్ని నింపే చర్యలు తీసుకోవాలని కోరారు. క్రెడాయ్, నిర్మాణ రంగ ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు, వారి ఆవేదనకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సరైన సమాధానం చెప్పలేకపోయారు. ప్రభుత్వం నిర్మాణరంగ సమస్యలను పరిష్కరిస్తుందని, సహకరించాలని కోరారు. నిర్మాణరంగ సమస్యలను, ఇక్కడకు వచ్చిన ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను సీఎం రేవంత్‌రెడ్డితో కూడా చెప్తామని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.