Bhatti Vikramarka | ఖమ్మం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బడంగ్‌పేట: కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దికు కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు.
అనంతరం తుక్కుగూడలోనూ, ఖమ్మం జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి భవన్‌లోనూ మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడ సభ చారిత్రాత్మక సభగా నిలిచిపోతుందని, దేశ భవిష్యత్తుకు దిశ, దశ చూపించబోతున్నదని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలన రాబోతున్నదని చెప్పారు. ఇదే ప్రాంగణం నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ప్రకటించిన హమీలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగదారులకు జీరో బిల్లు ఇస్తున్నామని, ఎవరికైనా బిల్లు వస్తే ప్రజాపాలన అధికారులను కలవాలని సూచించారు.