హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఆమరణ దీక్ష కీలక ఘట్టంగా నిలిచింది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని ప్రకటించేలా చేసింది. నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ దీక్షతో ఢిల్లీ పీఠం అదిరిపడింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకతప్పని పరిస్థితిని కల్పించింది. కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించి రేపటికి(నవంబర్ 29కి) 15 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ చౌరస్తాలో ఆనాటి జ్ఞాపకాలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
రాష్ట్ర సాధన కోసం ఆనాడు కేసీఆర్ చేసిన త్యాగాన్ని, ఆనాటి పరిస్థితులను కళ్లకుకట్టినట్టు చూపించారు. ఆనాడు ఉన్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వాదులను ఎలా కట్టడి చేశాయి? ఎలా అడ్డుకున్నాయి? అయినా రాష్ట్ర కాంక్షతో వాటన్నింటిని దాటుకుని కేసీఆర్ ఎలా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.? తన ప్రాణాన్ని సైతం ఎలా పణంగా పెట్టారనే విషయాలను వీడియోల రూపంలో చూపించారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణావాదులు, ప్రజలు ఈ వీడియోలను చూసి ఉద్వేగానికి గురయ్యారు. ఆనాడు కుల,మత, వర్గాలకతీతంగా ఎలా పోరాడామో.. ప్రభుత్వ అణచివేతను సైతం ఎదిరించి ఎలా రాష్ట్రం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశామో గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ ఆమరణదీక్షతోనే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగివచ్చిందని వారు గుర్తుచేశారు. అలాగే.. నేటి యువతకు చాలామందికి ఆనాటి ఉద్యమ పరిస్థితుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వై.సతీష్ రెడ్డి తెలిపారు. ఉద్యమసమయంలో చిన్న పిల్లలుగా ఉన్నవాళ్లు.. నేడు యువకులుగా మారారని.. వారికి తెలంగాణ ఉద్యమ ఘట్టాల గురించి తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నిలిచిందనే విషయాన్ని ప్రతి యువతీయువకులకు తెలిసేలా ప్రదర్శన నిర్వహించామన్నారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో నేటి యువత ముందుకెళ్లాలని సూచించారు. ఆనాటి పోరాటస్ఫూర్తిని మరోసారి గుండెల నిండా నింపుకుని.. రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సతీష్ యాదవ్, జగన్ మోహన్, శ్యాం, షఫీ, వెంకట్ రెడ్డి, అనిల్ గౌడ్, కౌశిక్, అశోక్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.