న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్‌పురిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లతో రోడ్డుపై ఉన్న షాపులను ధ్వంం చేస్తున్నారు. ఇటీవల హనుమాన్ జయంతి వేడుకల సమయంలో జహంగిర్‌పుర్‌లో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. జహంగిర్‌పురిలో యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేపట్టింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం సుమారు 400 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో జహంగిర్‌పురిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇవాళ తొమ్మిది బుల్డోజర్లు జహంగిర్‌పురిలో నిర్మాణాలను నేలమట్టం చేశాయి.
ఘర్షణలకు పాల్పడిన అక్రమ నిర్మాణదారులను గుర్తించి, ఆ నిర్మాణాలను నేలకూల్చాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా నగర మేయర్‌ను కోరుతూ లేఖ రాశారు. హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన శోభాయాత్ర సమయంలో ఓ మసీదు వద్ద అల్లర్లు జరిగాయి. ఆ ఘటనలో 9 మంది పోలీసులు గాయపడ్డారు. హింసతో సంబంధం ఉన్న 25 మందిని అరెస్టు చేశారు. హిందువులు ఆయుధాలతో యాత్రలో పాల్గొన్నారని, మసీదును ధ్వంసం చేసే ప్రయత్నం చేసినట్లు ముస్లింలు ఆరోపించారు. యాత్రలో ఆయుధాలు పట్టుకున్నది వాస్తవమే అయినా, హింసకు దిగింది ముస్లింలే అని హిందువులు ఆరోపించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఇవాళ సుప్రీంకోర్ట్ స్టే ఇచ్చింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తక్షణమే కూల్చివేతలను ఆపాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. సుప్రీం ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపేసినట్లు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు.