– ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ
– అవసరమైతే ఆందోళనలు చేసేందుకు సంసిద్ధత
– రైతుల సమస్యలపై మండల స్థాయి ప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమీక్ష
కోదాడ, జూలై 30 : కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా సమరశీల పోరాటం నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసంలో రైతులకు అవసరమైన విత్తనాల సరఫరా, విద్యుత్, సాగునీరు తదితర అంశాలపై బీఆర్ఎస్ మండల స్థాయి ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతాంగ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఆయా మండలాల్లోని గ్రామాలలో సాగు, తాగునీరు, కరెంట్ సరఫరా తదితర సమస్యలపై ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు అందజేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అప్పటికి పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు.
ఇప్పటికే సకాలంలో వర్షాలు రాక నార్లు ఎండిపోతున్న దుస్థితికి చేరుతుందన్నారు. భూగర్భ జలాలు కూడా అడుగంటి బోర్ల నుండి అంతంత మాత్రంగానే నీళ్లు సరఫరా అవుతున్నాయి అన్నారు. నార్లు ఎండిపోకుండా, నాట్లు వేసుకునేందుకు సాగునీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో రైతుల సమస్యలను మాజీ ఎమ్మెల్యే వివరించారు.. ఈ సమీక్షలో మండల ప్రతినిధులు నర్సిరెడ్డి, దేవపత్తిని సురేష్, కందిమండ సత్యనారాయణ, ఉపేందర్, జానకి, రామాచారి, భూపాల్ రెడ్డి, పొట్ట కిరణ్, చీమ నరేష్, నయీమ్, ఉపేందర్ గౌడ్, తుమ్మలపల్లి భాస్కర్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.