అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( CM Chandrababu ) దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) ఆరోపించారు. కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతూ వైసీపీ నాయకులను జైలుపాలు చేస్తున్నారని విమర్శించారు.
శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పరామర్శించేందుకు రాగా సమయం మించిపోవడంతో జైలు అధికారులు ములాఖత్‌ను రద్దు చేశారు. అనంతరం జైలు బయట సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు
. సీదిరి అప్పలరాజు కుమారుడు తెలిసి, తెలియక చేసిన ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందితే దాన్ని రాజకీయం కోసం వాడుకుంటూ మాజీ మంత్రిని కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలులో వేశారని మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన చిన్నపిల్లాడి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రోడ్డు ప్రమాదం చేయరని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోతే వారిపై ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వారికో న్యాయం. మరొకరికి మరో న్యాయమా అంటూ నిలదీశారు. ప్రభుత్వంలోని నాయకులు, కొంతమంది పోలీసులు మాఫీయా నడిపిస్తున్నారని ఆరోపించారు.
పేదవాళ్లపై చంద్రబాబుకు అసలు ప్రేమే ఉండదని, మత్స్యకారులు ఆరుగురు మృతి చెందితే పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీసీలను ఓటు బ్యాంక్‌కు మాత్రమే ఉపయోగించుకుంటారని ఆరోపించారు. కుట్రపూరితంగా సీదిరి అప్పలరాజు రాజకీయ ప్రస్థానాన్ని నాశనం చేయడానికి రాజకీయాలను నీచస్థితికి తీసుకెళుతున్నారని జగన్ విమర్శించారు. సీదిరి అప్పలరాజు కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.