– బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి
గరిడేపల్లి, ఏప్రిల్ 02 : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించి భూకబ్జాలు, అవినీతితో కాంగ్రెస్ పాలన పూర్తిగా దారి తప్పిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఘాటుగా విమర్శించారు. బుధవారం గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రంలో భూకబ్జాలు, అక్రమ మైనింగ్ విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. అసెంబ్లీలో ఈ అంశాలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అవమానానికి గురవడం కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కలహాలకు నిదర్శనమని అన్నారు. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని, అసెంబ్లీని చర్చల వేదికగా కాకుండా విమర్శలను అణచివేసే స్థలంగా మార్చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, ప్రశ్నిస్తే కేసులు, నిరసన చేస్తే అరెస్టులు అన్న ధోరణి కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హామీలు గాలికొదిలి వేశారని, మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు రైతుబంధు, ఉద్యోగాల నోటిఫికేషన్లు మాయమాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూనే, కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 22 అనుమతులు ఉన్నాయని అప్పుడే చెప్పిన నాయకులు, ఇప్పుడు అవినీతి అంటూ మాట్లాడటం రాజకీయ ద్వంద్వ వైఖరన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు నమోదు చేయడం, ప్రజల గొంతు నొక్కేలా చట్టాలు తీసుకురావడం ప్రభుత్వ అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి పాలన సర్వభ్రష్ట పాలనని, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని,కాంగ్రెస్ పతనం మొదలైందని ఆయన అన్నారు. అసెంబ్లీలో అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగిస్తున్న ముఖ్యమంత్రిపై ముందుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, కీత రామారావు, సర్పంచులు మాశెట్టి నాగలక్ష్మి శ్రీహరి, బోద సైదిరెడ్డి, సుధా నాగరాజు, రామ్ సైదులు, మాజీ ఎంపీటీసీ కడియం వెంకట్ రెడ్డి, బానోతు వెంకటేశ్వర్లు, గుగులోతు హేమ్లా నాయక్, మామిడి వెంకటేశ్వర్లు, కీతా నాగరాజు, భిక్షం, వీరయ్య గౌడ్, ఉమ్మడి నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు బచ్చలకూరి నాగశేఖర్, పంగ వీరస్వామి, నారాయణ అమరగాని వెంకటేశ్వర్లు, బోధ శ్రీనివాసరెడ్డి, బండ్ల గోపాల్, నగేష్, పిల్లి అంజయ్య పాల్గొన్నారు.
గరిడేపల్లి మండలంలోని గారకుంటతండాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుగులోతు నాగేశ్వరరావు కుటుంబాన్ని ఒంటెద్దు నరసింహారెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. నాగేశ్వరరావు మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటన్నారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయాన్ని అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

‘రాష్ట్రంలో క్షీణించిన ప్రజాస్వామ్యం.. దారి తప్పిన పాలన’