Ayodhya : వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఘటన. డెలివరీ కోసం ఓ గర్భిణి ప్రైవేటు ఆస్పత్రికి వస్తే ఫోన్ ద్వారా సూచనలిచ్చి డెలివరీ చేసింది ఓ లేడీ డాక్టర్. ఈ ఘటనలో ఆ తల్లి సహా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేనిగంజ్కు చెందిన సురేష్ యాదవ్ భార్య సోని యాదవ్‌కు పురిటి నొప్పులు రావడంతో మంగళవారం ఫైజాబాద్‌లోని మా పరమేశ్వరి దేవి మెమోరియల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను అంజలి శ్రీవాస్తవ అనే లేడీ డాక్టర్ పరీక్షించింది. సోని యాదవ్ ఆరోగ్య స్థితి మామూలుగానే ఉందని చెప్పింది. ఆ తర్వాత సోనికి డెలివరీ చేసే సమయానికి ఆ డాక్టర్ అందుబాటులో లేదు. దీంతో ఆమె ఫోన్లోనే ఇతర వైద్య సిబ్బందికి సూచనలిచ్చి డెలివరీ చేయించింది. వారికి సరైన అనుభవం లేకపోవడం వల్ల, డెలివరీ సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా ఆ మహిళ, అప్పుడే పుట్టిన బిడ్డ మరణించారు. డెలివరీ జరిగిన కొద్ది సేపటికి బిడ్డ శ్వాస తీసుకోవడం లేదని సురేష్ యాదవ్‌కు చెప్పారు. దీంతో సురేష్ యాదవ్ అప్పుడే పుట్టిన ఆ బిడ్డను తీసుకుని వేరే ఆస్పత్రికి వెళ్లి పరీక్షించగా, అప్పటికే శిశువు మరణించినట్లు చెప్పారు. ఇక, ఆస్పత్రికి తిరిగొచ్చేసరికి అతడి భార్య సోని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిపారు.
దీంతో ఆమెను కూడా వేరే ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా, ఆమె కూడా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత, నవజాత శిశువు మరణించారని బాధిత కుటుంబం ఆరోపించింది. వైద్యాధికారులకు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. వారు ఆస్పత్రిని పరిశీలించారు. సోనికి వైద్య సేవలో లోపాలున్నట్లు గుర్తించారు. డాక్టర్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరూ మరణించినట్లు తేలింది. దీంతో ఆస్పత్రిని సీజ్ చేశారు. అయితే, ఈ ఘటనపై సోని భర్త సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.