భూదాన్‌పోచంపల్లి, జూన్ 12 : పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉన్నదని, మారెటింగ్ సౌకర్యం కల్పిస్తే చేనేత పరిశ్రమ, చేనేత కళాకారులను చేయూతనిచ్చే వారమవుతారని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. గురువారం గవర్నర్ సతీమణి సుధాదేవ్వర్మతో కలిసి భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. చేనేత కార్మికుల యోగక్షేమాలు, చేనేత వృత్తిదారుల సాధకబాధకాలు తెలుసుకునేందుకు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. చేనేత మగ్గంపై తయారు చేస్తున్న పోచంపల్లి ఇకత్ ఉత్పత్తులను పరిశీలించారు. కార్మికుల సంక్షేమం, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పారులోని మ్యూజియంలో దారం నుంచి వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. ఎంపిక చేసిన చేనేత కళాకారులతో ముఖాముఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రపంచ సుందరీమణుల సందర్శనతో 30శాతం అమ్మకాలు పెరుగడం సంతోషమన్నారు. పోచంపల్లి ఉత్పత్తులకు మారెటింగ్ కల్పించేందుకు అహ్మదాబాద్‌లోని ఎన్ఐటీ, ఐఐటీ సహకారంతో స్థానిక చేనేత కార్మికులతో కలిసి అధ్యయనం చేయాలన్నారు. ఇకత్ చేనేత వారసత్వంగా వస్తున్న కళ అని, హ్యాండ్లూమ్స్ను కూడా హ్యాండీక్రాఫ్ట్ కోవలోకి వస్తాయని పేర్కొన్నారు. పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలకు డిజిలైటేషన్ కోసం రూ.10 లక్షల మంజూరు చేస్తున్నానని తెలిపారు. చేనేత కార్మికులకు వైద్య చికిత్స కోసం లాంబార్డ్ హెల్త్ కార్డు ఏర్పాటు, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పొం దిన వారు పోచంపల్లిలో ఉండడం అభినందనీయమని, ఇకత్ చీరలు ఖండాంతర ఖ్యాతి గాడించాయని అన్నారు. చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ రాష్ట్రంలో టెసో ద్వారా చేనేత మెటీరియల్‌ను సేకరిస్తున్నామని, ఈ ఏడాది పోచంపల్లి రూ.ఆరు కోట్లతో మెటీరియల్‌ను సేకరిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ రాకతో పోచంపల్లి మరోసారి ప్రాచుర్యం పొం దిందన్నారు. కలెక్టర్ హనుమంతరావు మా ట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఐఐటీ, ఎన్ఐటీ ద్వారా పోచంపల్లి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం నేతన్న బీమా పథకం కింద గర్దాస్ ఉపేందర్, వల్లకాటి భాగ్యలక్ష్మి, వనం యాదగిరికి రూ.ఐదు లక్షలు బీమా చెకులు, నేతన్న పొదుపు సీం కింద రూ.2.17 కోట్ల చెకులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకాంక్షయాదవ్, అడిషనల్ కలెక్టర్ భాసరరావు, భువనగిరి మారెట్ కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, వెంకటేశ్వరరావు, ఇందుమతి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ తదిత రులు పాల్గొన్నారు.