హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ విద్యపట్ల ఆసక్తి తగ్గుతున్నదా..? మూడేండ్ల డిగ్రీ కోర్సుల పట్ల విద్యార్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఏకంగా 2.96లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 929 కాలేజీల్లో 4.37 లక్షల సీట్లు ఉండగా, ఇప్పటి వరకు 1.41లక్షల సీట్లు మాత్రమే నిండాయి. దోస్త్ కౌన్సెలింగ్ ద్వారా 1.19లక్షలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో 9వేలు, నాన్దోస్త్ కాలేజీల్లో 12వేల సీట్ల చొప్పున 1.41 లక్షల సీట్లు నిండాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు అడ్మిషన్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని కాలేజీల్లో అయితే 15% సీట్లు కూడా నిండలేదు. 70కి పైగా కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ఈ సారి రెండు లక్షల సీట్లు నిండేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాళీ సీట్ల భర్తీకి దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం విడుదల చేశారు.
దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి మొదలవుతుంది. ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తికావడంతో విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. విద్యార్థులు ఈ నెల 26వతేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 20 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 27న నిర్వహిస్తారు. ఈ నెల 30న సీట్లు కేటాయిస్తారు. సీట్లు వచ్చిన వారు 30వ తేదీ నుంచి ఆగస్టు 1లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా.. ఇదే తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
