అగ్ర హీరో రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు గత ఏడాదిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు రామ్‌చరణ్. ‘పెద్ది’ హంగామా ముగియడంతో సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ చేయబోయే తదుపరి సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ రావడంతో తాజా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా లాంచింగ్ డేట్, ఇది ఏ జోనర్ కథాంశమనే విషయాలపై సోషల్‌మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ను దర్శకుడు సుకుమార్ లాక్ చేశారని సమాచారం. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది‘రంగస్థలం’ తరహా రూరల్ డ్రామా కాదని, రామ్‌చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఈసారి సరికొత్త కథను సిద్ధం చేశారని, నగర నేపథ్యంలో ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నాయి. ‘ఆర్సీ 17’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది.