హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) రీ ఎగ్జామ్లో 38వేల మంది తెలంగాణ విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. నిరుడు 41వేల మంది క్వాలిఫై అయితే.. ఈ సారి క్వాలిఫై అయిన వారి సంఖ్య మూడు వేలు తగ్గింది. ఏపీలో 33వేల మంది మాత్రమే క్వాలిఫై కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. జాతీయంగా నీట్లో క్వాలిఫై అయిన వారి సంఖ్య ఈ ఏడాది తగ్గింది. 2025లో 12.36లక్షల మంది క్వాలిఫై కాగా, ఈ ఏడాది 11.21లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అంటే క్వాలిఫై అయిన వారి సంఖ్య లక్ష తగ్గింది. నీట్-1 పరీక్ష రద్దు కావడం, తిరిగి ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది రీ ఎగ్జామ్ ఫలితాలపై స్పష్టంగా కనిపించింది.
రెండో సారి నిర్వహించిన పరీక్షకు తెలంగాణ నుంచి భారీగా విద్యార్థులు గైర్హాజరయ్యారు. అంతేకాకుండా విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారు. ఫలితంగా క్వాలిఫై అయిన వారి సంఖ్య తగ్గినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ నుంచి ఈ సారి 73వేల మంది దరఖాస్తు చేస్తే, 65 వేల మందే పరీక్ష రాశారు. దాదాపు 8వేల మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ప్రాంతీయ భాషల్లోనూ నీట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. తెలుగులో రాసేందుకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య కాస్త పెరిగింది. 2025లో 907 మంది తెలుగులో రాసేందుకు దరఖాస్తు చేయగా, 2026లో 1,339 మంది దరఖాస్తు చేసుకున్నారు.
