నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 29: ప్రత్యేక రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన దీక్షా దివస్‌ను రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరుపుకొన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట, మాక్లూర్, నవీపేట, కోటగిరి, బోధన్ పట్టణాల్లో దీక్షాదివస్‌ను పురస్కరించుకొని కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బోధన్పట్టణంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో హనుమకొండ అమరవీరుల జంక్షన్ వద్ద దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ 27వ డివిజన్ పరిధిలోని తెలంగాణ జంక్షన్లో ఏర్పాటుచేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ నాయకులు తెలంగాణ తల్లి, శ్రీకాంతాచారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. హాలియాలో టీఆర్ఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తుంగతుర్తి, ఆలేరు, గుండాల, తుర్కపల్లి మండల కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించారు.
విదేశాల్లో దీక్షాదివస్
న్యూజిలాడ్, మలేషియాల్లో టీఆర్ఎస్ ఎన్నారై విభాగాల ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, ఆయన నాయకత్వమే రాష్ర్టానికి రక్ష అని వక్తలు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో న్యూజిలాండ్ టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు వాడ్నాలా జగన్, మాజీ అధ్యక్షుడు కొస్నా విజయ్, కాసుగంటి కల్యాణ్, అరుణ్ ప్రకాశ్‌రెడ్డి, రాచకొండ రామారావు, పోకల కిరణ్, కొలిపాక మౌనిక, పానుగంటి శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, ఏనుగంటి సింహారావు, వరుణ్‌రావు, మలేషియా టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు కుర్మ మారుతి, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ దిశను మార్చిన దీక్షాదివస్ : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమ దిశను దీక్షా దివస్ మార్చేసింది. ఆందోళనల నుంచి పరిపాలన వరకు స్వరాష్ట్ర ఉద్యమం సాగింది. తెలంగాణ ప్రజలందరికీ, సీఎం కేసీఆర్‌కు దీక్షాదివస్ శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 29న తనను అరెస్టు చేసి, వరంగల్ జైలుకు తరలించిన ఫొటో, జైలు అధికారులు ఇచ్చిన పత్రాన్ని మంత్రి ట్విట్టర్లో పోస్ట్‌చేశారు.
ఉక్కు సంకల్పాన్ని చాటినరోజు : మంత్రి హరీశ్‌రావు
రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమనేత కేసీఆర్.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి, తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు దవాఖానలో కేసీఆర్ పక్కన ఉన్న ఫొటోను హరీశ్‌రావు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
చరిత్రను మలుపుతిప్పిన రోజు: ఎమ్మెల్సీ కవిత
ఉమ్మడి రాష్ట్ర సంకెళ్లను తెంచి, తల్లి తెలంగాణ విముక్తి కోసం ఆమరణ దీక్షతో ఉద్యమనేత కేసీఆర్ చరిత్రను ములపు తిప్పినరోజు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీక్షా దివస్ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరం అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో మీ వెంట కలిసి నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఆమె ట్వీట్ చేశారు.