అశ్వారావుపేట, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకుండానే తనకు ఓటు వేయలేదంటూ కాలనీ ప్రజలపై సదరు అభ్యర్థి అనుచరులు తమ అక్కసును వెళ్లగక్కారు. తీసుకున్న డబ్బులతోపాటు గిఫ్టులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన కాలనీవాసులు తాము తీసుకున్న కుక్కర్లను రోడ్డుపై పడవేసి ఆందోళనకు దిగారు. ఈ ఘటన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి ఏఎస్ఆర్ నగర్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పేరాయిగూడెంకు చెందిన మిండా హరిబాబు మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు.
ఓటుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసిన ఆయన అనుచరులు గెలుపుపై అనుమానంతో ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేశారు. అయితే 11వ తేదీ పోలింగ్ ముగిసిన తర్వాత గెలుపు అవకాశంపై అనుమానం రావడంతో వెంటనే అభ్యర్థి హరిబాబు వెంట ప్రచారంలో పాల్గొన్న బాలాజీ, అనిల్.. ఏఎస్ఆర్ కాలనీవాసుల వద్దకు వెళ్లి ఓటు వేయనందుకు తీసుకున్న డబ్బులతోపాటు కుక్కర్లు కూడా ఇవ్వాలని బుధవారం రాత్రి నుంచి డిమాండ్ చేశారు. ఒక దశలో తీవ్ర ఒత్తిడి చేయడంతో అసహనానికి గురైన కాలనీవాసులు తీసుకున్న కుక్కర్లను గురువారం రోడ్డుపై పడవేసి నిరసన వ్యక్తం చేశారు.
‘అసలు గిఫ్టులు ఎవరు ఇవ్వమన్నారు’ అంటూ మండిపడ్డారు. దీంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు తీసుకున్నారని, వాటిని కూడా జేసీబీతో కూల్చేస్తామని బెదిరించారని కాలనీవాసులు ఆకుల నాగయ్య, తిరుపతమ్మ, భవాని, తల్లూరి పద్మ, కన్నమ్మ, దుర్గలు మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు రాకుండానే ఓటు వేయలేదని మీకు మీరే ఎలా నిర్ధారించుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఓటు మీకే వేశాం.. అయినా మీరిచ్చిన డబ్బులు, గిఫ్టులు మాకొద్దు.. తీసుకెళ్లండి’ అంటూ మహిళలు రోడ్డుపైనే నిలబడ్డారు.
ఈ విషయంపై ఫోన్ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబుకు సమాచారం చేరవేస్తే.. నేను డబ్బులు పంచలేదని, ఈ అంశానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నట్లు బాధిత మహిళలు వివరించారు. సుమారు రెండు గంటలపాటు నిరీక్షించినప్పటికీ మహిళలు నిరసన తెలుపుతున్న ప్రాంతానికి కాంగ్రెస్ నాయకులు ఎవరూ రాకపోవడంతో గిఫ్టులు వెనక్కి అడిగిన బాలాజీ ఇంటి ముందు పడవేసి వెళ్లిపోయారు. కాగా.. దీనిపై కొందరు రాజకీయంగా గిట్టని వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, కాలనీవాసులు దీనిని నమ్మొద్దని కాంగ్రెస్ 10వ వార్డు అభ్యర్థి మిండా హరిబాబు ఒక ప్రకటనలో ఓటర్లను కోరారు. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.