జగిత్యాల జిల్లాలో విద్యాశాఖ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతమున్న స్కూల్ సమయం కంటే.. ప్రతి రోజూ సాయంత్రం అదనంగా రెమిడియల్ (ప్రత్యేక బోధన) తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు- అధికారుల మధ్య విభేదాలు పొడచూపుతున్నట్టు తెలుస్తున్నది. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు పలు సబ్జెక్టులు సరిగా చదవడం, రాయడం రావడం లేదని, అందుకే రెమిడియల్ క్లాస్‌లు అవసరమని అధికారులు చెబుతున్నారు.
అందుకోసం ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), ఉన్నత పాఠశాలల్లో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ క్యాంపెయిన్ (ఎల్ఐసీ) ప్రణాళికలు అమలు కుండా తమపై భారం మోపడం విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని టీచర్లు వాపోతుండగా.. విద్యార్థులు ఆయా తరగతులకు తగినట్టు చదవడం, రాయడం నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. విద్యావ్యవస్థలో లోపాలున్నాయని మరోసారి స్పష్టం అవుతుండగా.. ఈ తాజా నిబంధన ప్రస్తుతం ఉప్యాధ్యాయవర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
కరీంనగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జగిత్యాల జిల్లాలో ఉపాధ్యాయులకు విద్యాశాఖ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. పాఠశాల ముగిసిన తర్వాత ప్రతిరోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు రెమిడియల్ (ప్రత్యేకబోధన) తరగతులు నిర్వహించాలంటూ గత నెల 31న ఉత్తర్వులు (ఆర్సీ నంబర్ ఎస్పీ/డీసీఈబీ/125/20026-27) జారీ చేసింది. ఆ తరగతులను ఈ నెల1 నుంచి వచ్చే నెల 30 వరకు నిర్వహించాలని అందులో స్పష్టంగా పేర్కొన్నది. జగిత్యాల జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ సరిగా రాయలేకపోవడంతోపాటు చదువ లేకపోతున్నారని, అలాగే గణితం విషయంలో కనీసం బేసిక్ విషయాలు చెప్పలేకపోతున్నారని గుర్తించినట్టు విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఈ విధానంలో మార్పులు తెచ్చి.. విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేందుకు డీసీఈబీ జనరల్‌బాడీ కొన్ని తీర్మానాలు చేసిందని చెప్పింది. దాని ప్రకారం జిల్లాలోని జడ్పీ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు మాడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల్లో ప్రత్యేకంగా రెమిడియల్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపింది. తెలుగు, ఇంగ్లిష్ సరిగా చదవడం రాని విద్యార్థులతోపాటు నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పింది. ఈ క్లాస్‌లను ఇద్దరు ఉపాధ్యాయులు (ఒక భాషా ఉపాధ్యాయుడు, మరొక భాషేతర ఉపాధ్యాయుడు) రొటేషన్ సైకిల్ పద్ధతిలో నిర్వహించాలని, వీటిని ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమం పూర్తిగా విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడం కోసం ఉద్దేశించినదని పేర్కొంటూ ఒక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రత్యేక శ్రద్ధ వహించి తరగతులు నిర్వహించాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, సరిగ్గా తెలుగు, ఆంగ్లంలో చదవడం లేదా రాయలేని విద్యార్థులను, ప్రాథమిక గణితం చేయలేని విద్యార్థులను గుర్తించి ఒక్కో విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నైపుణ్యం పెంచాలని ఆదేశించింది. రెమిడియల్ తరగతుల ద్వారా విద్యార్థుల మెరుగవుతున్న ప్రమాణాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తెలుసుకోవాలని, ఈ విషయంలో ఎవరైనా డివియేషన్కు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సదరు ఉత్తర్వుల్లో జిల్లా విద్యాశాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), అలాగే ఉన్నత పాఠశాలల స్థాయిలో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ క్యాంపెయిన్ (ఎల్ఐసీ) పేరిట ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఎఫ్ఎల్ఎన్ను 1 నుంచి 5వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం.. ప్రతి విద్యార్థి తన తరగతికి తగిన స్థాయిలో చదవడం, విన్నది అర్థం చేసుకోవడం, సరైన రీతిలో రాయడం, ప్రాథమిక గణితం (కూడిక, తీసివేత, గుణకం, భాగహారం) చేయాలి. సంఖ్యలపై అవగాహన పెంపొందించడంతోపాటు భాషా నైపుణ్యాలు, ఆలోచనా శక్తి అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా రోజువారీ పఠన కార్యక్రమాలు, కథల ద్వారా బోధన, పదజాలం పెంపు, ఆటల ద్వారా గణితం, వారానికోసారి విద్యార్థుల అభ్యాస స్థాయి అంచనా, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ వంటి కార్యాచరణ అమలు చేయాలి.
అలాగే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ క్యాంపెయిన్.. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం రూపొందించిన కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం.. విద్యార్థుల్లో అభ్యాసనలోటును తగ్గించడం, తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్ వంటి విషయాల్లో ప్రావీణ్యం పెంచడం, బోర్డు పరీక్షలకు సిద్ధం చేయడం, క్లిష్టమైన అంశాలను సులభంగా బోధించడం, తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. అందులో భాగంగా ప్రతి నెలా అభ్యాస అంచనా పరీక్షలు, రెమిడియల్ టీచింగ్ (ప్రత్యేక బోధన), గ్రూప్ యాక్టివిటీలు, ప్రశ్నాపత్రాల సాధన, ప్రతి విద్యార్థి పురోగతిని నమోదు చేయడం, బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఈ రెండు కార్యక్రమాల వల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని పెట్టారు. ప్రధానంగా విద్యార్థులకు చదవడం, రాయడంలో నైపుణ్యం పెరుగుతుందని, గణితంపై భయం తగ్గుతుందని, ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని నిరంతరం పరిశీలించడం వల్ల అవసరమైన సహాయం అందుతుందని, వెనుకబడిన విద్యార్థులు కూడా తమ తరగతి స్థాయికి చేరుకునే అవకాశం ఏర్పడుతుందని, 10వ తరగతి ఫలితాలు మెరుగుపడే అవకాశం ఉంటుందని, డ్రాప్అవుట్లు తగ్గి, హాజరుశాతం పెరగడానికి దోహదపడుతుందని, ఉన్నత విద్యకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు బలోపేతం అవుతాన్నయన్న లక్ష్యంతో.. ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐసీ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఈ రెండు కార్యక్రమాలుండగా.. కొత్తగా మళ్లీ అదనపు తరగతుల అవసరం ఎందుకని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క జగిత్యాల జిల్లాలో రెమిడియల్ తరగతుల పేరిట విద్యాధికారులు విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రాథమిక సూత్రాల ప్రకారం.. ఏడాదికి 220 పనిదినాలు ఉండాలని, ప్రాథమిక పాఠశాలల్లో 800 బోధనా గంటలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వెయ్యి బోధనా గంటలు పనిచేయాలని చట్టం చెబుతున్నది. కానీ, దీనికి విరుద్ధంగా తాజాగా విడుదల చేసిన నిర్ణయాలున్నాయనే భావన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతున్నది.
నిజానికి పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతను పెంచాలన్న లక్ష్యంతో.. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తారని, దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం ఉంటుందని, కానీ, ఇప్పుడు రెమిడియల్ తరగతుల పేరుతో జగిత్యాల జిల్లాకు మాత్రమే జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కొంత మంది ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.
జిల్లా విద్యాధికారులు విద్యలో వెనకబాటుతనానికి కారణాలు వెతికి, అందుకనుగుణంగా యాక్షన్ రీసెర్చ్ చేసి, అందులో డైట్ కేంద్రాల సహకారం తీసుకొని సరైన విధానాలను అవలంభించాలని పేర్కొంటున్నారు. విద్యలో వెనకబడిన విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ పేరిట ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపట్టి.. అందుకోసం మోడల్స్ తయారు చేసిందని, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐసీ పేరుతో సాయంత్రం పాఠశాల ముగిసే వరకు రకరకాల కార్యాచరణ అమలు చేయిస్తున్నదని, ఇది కా కుండా మళ్లీ ఈ గంట కార్యక్రమం ఎందుకన్న ప్రశ్నలను ఉపాధ్యాయులు సంధిస్తున్నారు.
దీనికి రాష్ట్ర విద్యాశాఖ అనుమతి ఉందా..? ఒకవేళ అంగీకరిస్తే విద్యాహక్కు చట్టం ఎందుకు? ఎవరికోసం? అన్న చర్చ ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో నడుస్తున్నది. ఇది ఇలా ఉంటే.. లోపాన్ని గుర్తించాలని ఉపాధ్యాయులు కోరుతుండగా.. లోపం ఉన్నది కాబట్టే ప్రత్యేక బోధ నా తరగతులు పెడుతున్నామని అధికారులు చెబుతున్న తీరు, కొత్త నిబంధనలు ఉపాధ్యాయుల్లో హాట్‌టాఫిక్‌గా మారాయి. ఇది జగిత్యాలకే పరిమితం అవుతుందా..? లేక.. ఉమ్మడి జిల్లాలకు విస్తరిస్తుందా..? అన్న చర్చ కూడా జోరుగా నడుస్తున్నది.