చండూరు, సెప్టెంబర్ 30 : చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన గడ్డి పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం బుధవారం కనిపించడం మండలంలో కలకలం రేగింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే చండూరు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని కనగల్ మండలం పోనుగోడు గ్రామానికి చెందిన బండమీది శ్రీనుగా గుర్తించారు. శ్రీను కూరంపల్లి గ్రామంలో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహం లభించిన ప్రదేశం, పరిసరాలను పరిశీలించారు. ప్రమాదం వల్ల చనిపోయాడా లేక ఇంకా ఇతర కారణాలతో మరణించి ఉండవచ్చా అని స్థానికులు అనుమానాలు వ్యక్త పరుస్తుండడంతో మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.