హనుమకొండ చౌరస్తా, జనవరి 18: గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అందరం కృషి చేద్దామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నకలకు సమాయత్తం అవుదామనిని పిలుపునిచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
గ్రేటర్ వరంగల్ మేయర్ రిజర్వేషన్ ఖరారైన విషయంపై చర్చించారు.
మున్సిపల్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో ఓరుగల్లు నగరానికి అనేక కేంద్ర, రాష్ట్రాల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణాలు, పార్కులు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం కోట్లాది నిధులను వెచ్చించినట్లు తెలిపారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ వరంగల్‌కు రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతోనే ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేశారని, రానున్న రోజుల్లో కార్పొరేషన్ వేదికగా స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.
నగరవాసులకు తాగునీరు సక్రమంగా అందేలా చూడాలని, పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ, స్థానిక మౌలిక వసతులు కల్పనలో ఎలాంటి అంతరాయాలు, లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యలు పరిష్కరించాలని. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులుగా ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజల నుంచి ఆదరణ తప్పకుండా ఉంటుందని, సమస్యలు సైతం పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సంకు నర్సింగరావు, సోదా కిరణ్, ఇమ్మడి లోహిత రాజు, నాయకులు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.