వికారాబాద్, జూన్ 27 : సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను కనీసం ఒక్క స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం బీసీలపై కొనసాగుతున్న వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యం అని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో కెనరా బ్యాంక్ వెనుకాల ఉన్న ఆశ్రిత్ విల్లాలో బీసీ నాయకులతో రౌంటేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బీసీలు ఐక్యమైతే రాజ్యాధికారం నల్లేరుపై నడకే అని అన్నారు. ప్రతి గ్రామాన్ని ఒక రాజకీయ యూనిట్ గా ఏర్పాటు చేసుకొని పూర్తిస్థాయి కమిటీలను జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా మండల వారీగా, ఎన్నికలు జరిగే ప్రతి చోట బీసీ ఐక్య వేదికలు ఏర్పాటు చేస్తామని అన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అందించాల్సిన గురుతర బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మాని బీసీ రేజర్వేషన్ల పెంపునకు నిబద్దతతో కృషి చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా కాలయాపన చేస్తుందే తప్ప అందుకు అవసరమైన జీవోను విడుదల చేయడం గాని రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయడానికి పూనుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, బీసీ ఎస్సీ, ఎస్టీ జేఏసీ వికారాబాద్ జిల్లా నాయకులు రవీందర్, యాదయ్యగౌడ్, రాములు, లాలయ్య, శ్రీశైలం, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.