హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాఫిక్ చలాన్లను ఆటోడెబిట్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి వసూలు చేయాలని సీఎం పోలీసులకు సూచించడంపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి కనీస రాజ్యాంగ స్ఫూర్తి లేదు, అవగాహన లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి మాట అంటే ఆదేశమని, అలాంటి ఆదేశానికి చట్టబద్ధత, నియమనిబద్ధత ఉండాలని శ్రవణ్ చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి ఏదిపడితే అది మాట్లాడటం కరెక్టు కాదని, అలా మాట్లాడితే ఆ వ్యక్తి జోకర్‌గా మిగిలిపోతారని అన్నారు. రేవంత్‌రెడ్డి జోకర్లా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని, ఆయనది అహంకారమా, అజ్ఞానమా, అమాయకత్వమా..? తెలియదని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తమని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి ఆటోడెబిట్ ద్వారా చలాన్లను వసూలు చేయాలని సూచించడం దారుణమని అన్నారు. ఆటోడెబిట్ ద్వారా ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయాలనే నిర్ణయంతో సీఎం.. విచ్చలవిడి అవినీతికి, దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.