కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆగమైన అన్నదాత నెత్తిన మరో పిడుగు పడబోతున్నది. కొత్త సంవత్సరం నుంచి డీఏపీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. 50 కిలోల బ్యాగుపై 300కుపైగా పెరుగుతుందని అధికారులు చెబుతుండగా, తమపై పెనుభారం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏ ముహూర్తంలో వచ్చిందో ఏందో కానీ, మమ్మల్ని మాత్రం సంపుకతింటుందని భగ్గుమంటున్నారు. రైతుభరోసా లేదని, వరికి బోనస్ బోగస్ అయిందని, రుణమాఫీ అరకొర ముచ్చటేనని, విత్తనాల ధరలు పెరిగాయని వాపోతున్నారు. ఇప్పుడు డీఏపీ ధర కూడా పెంచుతరట అని మండిపడుతున్నారు. ఇలా అయితే ఎవుసం ఎలా చేసేదని ప్రశ్నిస్తున్నారు.
జగిత్యాల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ‘రైతులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాం. రైతు రుణమాఫీ చేశాం’ అని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. రెండు సీజన్ల నుంచి రైతులకు ఇచ్చే రైతుబంధు నిలిచిపోయింది. రెండు లక్షల రుణమాఫీ 40 శాతం మందికి కూడా వర్తించలేదంటూ రైతులు నిత్యం ఏదో ఒక్కచోట తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాగే, వరి క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని చెప్పి తీరా వానకాలం పంట చేతికి వచ్చే సమయంలో సన్నాలకు మాత్రమే అని చెప్పడంతో హతాశులయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులతో దిగాలుపడిన రైతులకు విత్తనాల ధర పెంపు మరింత ఆవేదనకు గురి చేసింది. తాజాగా, డీఏపీ ధరలు పెరుగుతాయని అంటుండడం వారి నెత్తిన పిడుగు పడ్డట్టవుతున్నది. డీఏపీ ధరలకు రెక్కలు వస్తే రైతాంగంపై పెనుభారం పడే ముప్పున్నది.
డీఏపీ ధరల పెంపు!
వ్యవసాయం మొదలు పెట్టే సమయంలో డీఏపీ అత్యంత కీలకమైన ఎరువుగా రైతులు వినియోగిస్తారు. వరితోపాటు మిగిలిన అన్ని పంటలకు దాదాపుగా డీఏపీని ప్రారంభ దశలో వినియోగిస్తూ వస్తున్నారు. దీని ధర అధికంగానే ఉన్నప్పటికీ కేంద్రం సబ్సిడీపై డీఏపీని ఇస్తున్నది. వాస్తవంగా డీఏపీ 18-46-0 యాభై కిలోల బ్యాగు ధర 2,445.55 గా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 1095.55 సబ్సిడీ పోను 1350 నికర ధరకు అందిస్తున్నది. కేంద్రం మూడేండ్లుగా భారతీయ జన యూర్వరిక్ పరియోజన పథకంలో భాగంగా ఇదే ధర, సబ్సిడీని కొనసాగిస్తూ వస్తున్నది. అయితే, కొత్త యేడాది ప్రారంభం నుంచి డీఏపీ ధర పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు బ్యాగును 1650కి విక్రయించాలని డీలర్లకు ముందస్తు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే కేంద్రమే ధరలు పెంచిందా..? లేక సబ్సిడీలో మార్పు వచ్చిందా..? అన్న వివరాలు ఇంకా పూర్తిగా తెలియడం లేదని డీలర్లు, అధికారులు వాపోతున్నారు. డీలర్ల వద్ద ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను ఏడాది చివరి వరకు 1350కి విక్రయించి, తర్వాత రేట్లు పెంచి విక్రయించే అవకాశాలున్నాయని డీలర్లు చెబుతున్నారు.
రైతులపై పెనుభారం
వ్యవసాయానికి పెట్టింది పేరుగా నిలుస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానకాలం దాదాపు 8 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు, ఈ యాసంగిలోనూ అదే తీరున సాగుకు సిద్ధమవుతున్నారు. వరితోపాటు మక్క, నువ్వు లాంటి పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1.30 లక్షల టన్నుల వినియోగం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్, ఇతర ఏజెన్సీల్లో డీఏపీ నిల్వలు ఉన్నట్టు పేర్కొంటున్నా.. వాస్తవికంగా పెద్ద మొత్తంలో నిల్వలు లేవని చెబుతున్నారు.
డీలర్లు, ఏజెన్సీల నిర్వాహకులు సరైన విధానాల్లో లెక్కలు సమర్పించలేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతమున్న అవసరాలరీత్యా పరిశీలిస్తే కేంద్రం నుంచి పెద్ద మొత్తంలోనే డీఏపీ సబ్సిడీ ఎరువును తెప్పించుకోవాల్సి వస్తుందంటున్నారు. 50 కిలోలకు 300 చొప్పున పెంచితే క్వింటాల్‌కు 600 చొప్పున దాదాపు 78 కోట్ల నుంచి 80 కోట్ల అదనపు భారం రైతులపై పడొచ్చని అంచనా వేస్తున్నారు. తీవ్రమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులకు డీఏపీ ధర పెంపు మరింత భారమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ధర పెరుగుదలపై జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి రామచంద్రంతో మాట్లాడగా, ధర పెరుగుతుందని చెబుతున్నారే తప్ప.. ఇంత వరకు తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని సమాధానమిచ్చారు.
విత్తన ధరలూ భారమే
ప్రైవేట్ రంగ సంస్థల కంటే ప్రభుత్వ రంగ సంస్థే అధిక ధరకు విత్తనాలను విక్రయిస్తున్నది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ.. సహకార సంఘాలు, ఆగ్రోస్ ద్వారా 25 కిలోల దొడ్డురకం విత్తనాల బ్యాగును 995 చొప్పున విక్రయించింది. సన్నరకం విత్తనాలను 1005కు అమ్మింది. అయితే, బయట మార్కెట్లో ఇవే విత్తనాలు ఇంత కంటే తక్కువ ధరకు దొరుకుతున్నాయి. దొడ్డురకానికి చెందిన 25 కిలోల విత్తన సంచి బయటి మార్కెట్లో 895కు, సన్నరకాలు 905కు అమ్ముతున్నారు. ప్రైవేట్ కంటే అధిక ధర ఉండడంపై రైతులు ఆగ్రహిస్తున్నారు. గతేడాది కంటే ఈ యేడాది విత్తనాల ధర పెరగడంతో అదనపు భారం పడుతుండగా, ఇలా ధరలు పెంచుకుంటూ పోతే సాగు చేసేదెలా అని ప్రశ్నిస్తున్నారు.