Danger | మాడ్గుల, ఫిబ్రవరి4 : ఊరు మధ్యలో చెదురు బావి.. సరైన రక్షణ గోడ లేకపోవడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. ఎప్పుడూ మూగజీవాలు పడి చనిపోతూనే ఉంటాయి. అందుకే చిన్న పిల్లలను అటువైపు నుంచి పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడిపోతుంటారు. అయినా పట్టించుకునే నాథుడే కరువు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని పాత బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ బావి అంటేనే.. ఇప్పుడు ఆ గ్రామస్థులకు దడపుట్టిస్తోంది.
పాతబ్రాహ్మణపల్లిలో ఉన్న ఈ చెదురు బావికి ఎంతో చరిత్ర ఉంది. పూర్వం ఈ బావి ఎంతో మంది ప్రజల దప్పికను తీర్చింది. కానీ రానురానూ ఇంటింటికీ నల్లాలు రావడంతో ఈ బావిపై ఆధారపడే వాళ్లు తగ్గిపోయారు. బోర్లు కూడా ఎక్కువ కావడంతో ఈ బావి కూడా ఎండిపోయింది. దీంతో ఆ బావిని పట్టించుకునే వాళ్లు కరవయ్యారు. దీంతో ఆ బావి శిథిలావస్థకు చేరుకుంది. దీనికి రక్షణ గోడ కూడా లేకపోవడంతో ప్రమాద నిలయంగా మారిందని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం పూట వ్యవసాయ పొలాల్లోకి వెళ్లే రైతులకు ప్రమాదంగా ఉందంటున్నారు. రాత్రి పూట బావి సరిగ్గా కనిపించడం లేదని చెబుతున్నారు. ఎవరైనా పొరపాటున పడితే అంతే సంగతులు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి బావిని పూడ్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.