హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విశేషంగా కృషి చేస్తున్నారని, దళిత జాతి సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని షెడ్యూల్డ్ కులాల, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పొందుపరిచిన రూ.33,937.75 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో గురువారం ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎస్సీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో 15.49 శాతం నిధులను కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దళితుల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టడంతోపాటు, ఈ సారి బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారని ఆనందం వ్యక్తం చేశారు. దళితబంధు ద్వారా 2022-23లో 4 లక్షల కుటుంబాలకు మేలు చేకూరనున్నదని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అనంతరం బడ్జెట్‌పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ సర్వమతాలకు సమాన గౌరవం కల్పిస్తున్నారని, మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ప్రతి బడ్జెట్లోనూ మైనారిటీల సంక్షేమానికి నిధులను ప్రభుత్వం పెంచుతూ వస్తున్నదని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది 1,600 కోట్లను కేటాయించగా, ఈ ఏడాది రూ.1,700 కోట్లకు పైగా కేటాయించారని వివరించారు. విస్తృత సంఖ్యలో గురుకులాల ఏర్పాటుతో మైనారిటీల విద్య 18 నుంచి 42 శాతానికి పెరిగిందని వివరించారు. షాదీముబారక్ ద్వారా పేదింటి యువతుల పెండ్లికి ఆర్థిక సాయం, ముస్లిం యువతకు ఓన్ ఆటో స్కీమ్ కింద 17,044 మందికి ఆటోలను అందజేశామని వెల్లడించారు. అన్యాక్రాంతమైన సుమారు 948 ఎకరాల వక్ఫ్ భూమిని గత ఏడేండ్లలో కబ్జా చెర నుంచి విడిపించామని, అందుకు సంబంధించిన 150 సేల్ డీడ్లను రద్దు చేశామని తెలిపారు. అదీగాక వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు.