కరీంనగర్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో హుజరాబాద్ నియోజకవర్గం దళిత బంధు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే బాబు, డాక్టర్ జగ్జీవన్ రామ్ కన్న కలలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయలను నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తామన్నారు.
దళితులు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. దళిత బంధు పథకం ఎక్కడో ఉన్నా చుట్టాలను, బంధువులను ఆత్మీయంగా ఏకం చేసింది అన్నారు. దళితులు దళిత బంధును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి 94 కోట్ల 84 లక్షల విలువైన 769 వాహనాలను1041 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ సురేష్, ఆర్డీవో ఆనంద్ కుమార్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత రెడ్డి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.