హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : పోలీసులు, జడ్జీల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకూడదు, అది సైబర్ నేరగాళ్ల పని కావొచ్చు అంటూ ఫోన్‌కాల్స్ సమయంలో అలర్ట్ డయలర్ టోన్ వస్తున్నది. అయినా కొందరు గుడ్డిగా మోసపోతున్నారు. కొందరి అమాయకత్వమే ఆసరాగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో వలపన్ని లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఓ కేసు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం కాప్రాకు చెందిన రిటైర్ట్ ప్రైవేట్ ఉద్యోగి ఒంటరిగా నివాసముంటున్నాడు. ఆయనకు ఈ నెల 16న ఢిల్లీ పోలీసుల పేరుతో సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము ఢిల్లీ సీఐడీ విభాగం పోలీసులమని చెప్పారు. మీ ఆధార్ నంబర్‌తో జరిగిన లావాదేవీల కారణంగా మనీలాండరింగ్ కేసు నమోదైందని, సుప్రీంకోర్టు, ఆర్బీఐ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు. ఆ నోటీసులపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. విచారణ కోసం ఢిల్లీకి రావాల్సి ఉంటుందని సూచించారు. తనకు ఏ కేసుతోనూ సంబంధంలేదని బాధితుడు తెలిపాడు.
రాకపోతే తామే వచ్చి, అరెస్ట్ చేయాల్సి ఉంటుందని సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఢిల్లీకి పిలిపించకూడదంటే తాము చెప్పిన ఖాతాలో డబ్బులు జమ చేయాలని, ఆ డబ్బంతా సుప్రీంకోర్టు ఆధీనంలో, ఆర్బీఐ ఖాతాలో డిపాజిట్ అవుతుందని చెప్పారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేలిన తర్వాత ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇలా నాలుగు రోజుల్లోనే రూ.22.05 లక్షలను సైబర్‌నేరగాళ్లు చూపించిన ఖాతాలోకి బాధితుడు పంపించాడు. సైబర్‌నేరగాళ్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాట్సాప్‌లో వీడియో కాల్ చేశారు. అనుమానం వచ్చిన బాధితుడు ఈ విషయాన్ని తనకు తెలిసిన వాళ్లతో చర్చించడంతో ఇదంతా సైబర్‌నేరగాళ్ల మోసమని వారు చెప్పారు. దీంతో ఆయన 1930కు ఫిర్యాదు చేసి, రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.