బెట్టిగేరి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు కర్ణాటక రైతులు ఎటువంటి పాట్లు పడుతున్నారో తెలిపేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు. కొప్పాల్ తాలుకా బెట్టిగేరి గ్రామానికి వెళ్లే దారిలో (బిసిరల్లి) మారుతీరావు అనే రైతు కౌలుకు తీసుకున్న ఎకరం విస్తీర్ణంలో మిరప పంట వేశారు. కౌలు అద్దె రూ.20వేలు కాగా.. మరో 25వేలు ఖర్చు పెట్టి మందులు, ఎరువులు వేశారు. వర్షాలు పడే సమయంలో వేసిన మిరప పైర్లు ఆ తర్వాత నీరు లేకపోయినా మొక్కలు పెరిగాయి. కానీ గతవారం పది రోజుల నుంచి తడి అందకపోవడంతో మిరపపైరు ఎండిపోవడం మొదలైంది. ఇదిచూసి తట్టుకోలేని మారుతిరావు..తన భూమికి యజమాని, రోడ్డుకు ఆవల పొలం ఉన్న ఔషదప్పను ఆశ్రయించాడు. పొలం వద్ద ఆయనకు గొట్టపు బావి ఉంది. అక్కడి నుంచి మిర్చి తోటకు పైపులు వేసుకొని నీరు పెడతానని, పంట అమ్మగా వచ్చే సొమ్ములో సగం ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
‘నమస్తే తెలంగాణ’ బృందం బెట్టిగేరి వెళ్తున్న సమయంలో మారుతీరావు, ఆయన తండ్రి ఫకీరప్ప ఒక పక్కన రోడ్డు తవ్వి పైపులు వేసి మట్టికప్పుతూ కనిపించారు. దీనిపై ఔషదప్పను కదిలిస్తే.. కరెంటు ఉంటేనే గొట్టపు బావి నుంచి నీరు తోడగలమని, కష్టపడి పైపులు వేసినా కరెంట్ ఉంటుందన్న గ్యారెంటీ లేదని చెప్పినా మారుతీరావు వినలేదని చెప్పారు. తన వద్ద బోరుబావి ఉన్నా మూడు ఎకరాలలో వేసిన జొన్న చేనును కాపాడుకోలేకపోయానని తెలిపారు. అయి నా ఆశ చావని మారూతిరావు తన భగీరథ ప్రయత్నం మానలేదని అన్నారు.