– నల్ల బ్యాడ్జీలతో పంచాయతీరాజ్ ఉద్యోగుల నిరసన
చుంచుపల్లి, సెప్టెంబర్ 01 : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, TGEJAC పిలుపు మేరకు చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పులికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పులికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగికి పెన్షన్ అనేది హక్కు తప్ప భిక్ష కాదని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2004 నుండి సీపీఎస్ అమలులో ఉండటంతో ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఓపీఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జిల్లా పరిషత్ యూనిట్ మినిస్టీరియల్ స్టాఫ్ యూనియన్ కార్యదర్శి అంబికాదేవి, పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు తదితరులు హాజరయ్యారు.