CPM | రామగిరి (నల్గొండ) మార్చి 4 : ప్రజా సమస్యలపై సీపీఎం పోరుబాట పట్టింది. నల్గొండ మున్సిపాలిటీ 11వ వార్డు కతాల్ గూడ స్మశాన వాటికలో ప్రహరీ గోడ నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 11వ వార్డు సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. పట్టణంలో 2013లో విలీనమైన మామిళ్లగూడెం గ్రామపంచాయతీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.
విలీనం అయిన తర్వాత ఉపాధి హామీ పని కోల్పోయారని ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తూ పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూమిలేని పేదలను విస్మరించడం సరికాదని.. వెంటనే పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూమిలేని పేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్మశానం కంపచెట్లతో నిండిపోయిందని, స్మశాన వాటికకు వెళ్లడానికి రోడ్డు మొత్తం గుంతలమయమై.. కంపచెట్లు తీవ్ర ఆటంకంగా ఉన్నాయని అన్నారు. దేవరకొండ రోడ్డు నుండి స్మశానం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని స్మశాన వాటికకు ప్రహరీ గోడ, నీటి సదుపాయం, స్నానపు గదులు, దహన వాటికలు నిర్మించాలని డిమాండ్ చేశారు. దేవరకొండ రోడ్డు నుండి మామిళ్లగూడెం మీదుగా నర్సింగ్ బట్ల రోడ్ వరకు డబల్ రోడ్ సీసీ వేయాలని డిమాండ్ చేశారు.
అర్బన్ కాలనీలో ఉన్న పార్కు కు ప్రహరీ గోడ నిర్మించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. సాగర్ రోడ్డు నుండి కొత్తపల్లి కాలువ కట్ట వరకు సెంటర్ లైటింగ్, డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. పై సమస్యల పరిష్కారం కోసం నెల రోజులపాటు సంతకాల సేకరణ, ప్రజలతో గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసి నెలాఖరులో జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలన్నింటి పరిష్కారం కోసం మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై సీపీఎం పోరుబాట లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీమ్, పట్టణ కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ, కుంభం కృష్ణారెడ్డి, భూతం అరుణ, శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, శాఖ సభ్యులు దండెంపల్లి యాదయ్య, మారయ్య, సర్దార్ అలీ, విష్ణుమూర్తి, రామకృష్ణారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు