చండూరు, మే 12 : నిరంతరం ప్రజల పక్షాన నిలబడి, దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసమే భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ మండల 15వ మహాసభ చండూరు మండల పరిధిలోని ధోనిపాముల గ్రామంలో జరిగింది. ఈ మహాసభకు పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాసభకు ముందు పార్టీ అరుణ పతాకాన్ని ఎమ్మెల్సీ సత్యం ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మహాసభలో పళ్ల వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కావస్తున్న పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించే విధానాలకు పాల్పడుతుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి విచారకరమన్నారు. టెర్రరిజాన్ని అంతమొందించడానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి మద్దతు ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు నిధులు తక్కువ కేటాయించడం, వెనక బడిన రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం సరైనా పద్ధతి కాదన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సీపీఐ అన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. చండూర్ మండలంలో సీపీఐకి ఎంతో బలం ఉందని, పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి అనేక త్యాగాలు చేసిన పార్టీగా మంచి గుర్తింపు ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల సహాయ కార్యదర్శి యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, మాధగోని విజయలక్ష్మి, బరిగెల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీశ్ కుమార్, మండల కార్యవర్గ సభ్యులు తిప్పర్తి రాములు, బరిగల వెంకటేశ్, దోటి వెంకన్న, బండమీది వెంకటేశం, ఇతర నాయకులు పాల్గొన్నారు.