సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సాధన సమితి సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో చాడ వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. 1984లో ఫ్యాక్టరీ ప్రారంభం కాగా.. 1998లో ఉత్పత్తిని నిలిపివేశారన్నారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నా అప్పటి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను అన్యాయంగా మూసివేసిందని, దాంతో వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సీసీఐని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీనిపై ఇటీవల మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారని, సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు.