Kunamneni | మావోయిస్టు అగ్ర నేత హిడ్మాను చంపి.. దాన్ని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ.. మావోయిస్టుల ఎన్కౌంటర్ల అంశంపై చర్చించేందుకు గురువారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిడ్మా కోరితే ఆశ్రయం ఇచ్చే వాళ్లమని అన్నారు. అతన్ని తానే డీజీపీకి సరెండర్ చేయించేవాడిని అని పేర్కొన్నారు. హిడ్మాను చంపి ఎన్కౌంటర్ అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యలు తెలుసుకోవాలని కూనంనేని సూచించారు. ఇలా చంపడం సరికాదని.. అరెస్టు చేసి చట్టం ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాలని అన్నారు. దేవ్‌జీ కూడా పోలీసుల చెరలో ఉన్నట్లు తెలుస్తోందని.. అసలు పోలీసుల చెరలో ఎంతమంది ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి నాటికి మావోయిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదేమైనా యుద్ధమా అని ఆయన ప్రశ్నించారు. దండకారణ్యంలో విలువైన ఖనిజ సంపద కోసమే ప్రభుత్వం మావోయిస్టులను హతమారుస్తుందని ఆరోపించారు. ఏకపక్ష కాల్పులను కూడా బండి సంజయ్ ఎన్‌కౌంటర్‌గా చెప్పడం దారుణమని మండిపడ్డారు. హింసను వీడి, శాంతియుత పరిష్కారాల దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు.