Gold-Silver Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గినట్టే తగ్గి మరోసారి పైకి కదిలాయి. మార్కెట్లో మంగళవారం ధర భారీగా దిగివచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మళ్లీ పెరిగింది. డిమాండ్ బలంగా ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధర పెరిగినట్లుగా ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.1500 పెరిగి తులానికి రూ.1,27,300కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1500 పెరిగి తులానికి రూ.1,26,700కి చేరుకుంది.
అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే పెరిగింది. రూ.4వేలు పెరిగి కిలోకు రూ.1.60లక్షలకు ఎగిసింది. దాంతో మూడురోజుల తర్వాత ధరలు బులియన్ మార్కెట్లో ధరల తగ్గుదలకు బ్రేక్ పడినట్లయ్యింది. యూఎస్ లేబర్ మార్కెట్లో బలహీనమైన సంకేతాలు వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ వరుసగా రెండో సెషన్లో పెరిగాయి. ఔన్స్‌కు 1.14 శాతం పెరిగి 4,114.01 డాలర్లకు చేరుకుంది.
ఔన్సుకు వెండి ధర 3.09 శాతం 52.26 డాలర్లకు పెరిగింది. బుధవారం రాత్రి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) అక్టోబర్ సమావేశం వివరాలు వెల్లడికానుండగా.. పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. దాంతో స్పాట్ గోల్డ్ 4,084 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతోందని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ రీసెర్చ్, ఏవీపీ విశ్లేషకుడు కైనాత్ చైన్వాలా మాట్లాడుతూ.. బంగారం మంగళవారం కనిష్ట స్థాయి నుంచి కోలుకుని ఔన్సుకు 4,065 కంటే ఎక్కువగా ముగిసిందని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,24,860 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,14,450 పలుకుతున్నది. ఇక కిలో వెండి రూ.1.76లక్షల వద్ద ట్రేడవుతున్నది.