హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి సభ్యులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. సదరు బ్యాంక్ వాటాదారుల సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పి నవీన్‌రావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 8న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారని తేలడంతో బ్యాంకు చైర్మన్ రమేశ్ కుమార్ బంగ్, వైస్ చైర్మన్లు పురుషోత్తం దాస్ మంధాన, లక్ష్మీ నారాయణ రైతి, బ్యాంక్ ఎండీ, సీఈవో ఉమేష్ చంద్ అసవాలతోపాటు డైరెక్టర్లు ప్రేమ్ బజాజ్, రాం భండారి, గోవింద్ నారాయణ రైతి, పుష్ప బూద్, భదరీ విశాల్ ముందాడ, బర్జ్ గోపాల్ అశ్వా, పి మురళీ మనోహర్లకు నోటీసులు వచ్చాయి. ఇందులో డిసెంబర్ 10న జరిగే విచారణకు హాజరై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.