రామన్నపేట, నవంబర్ 05 : రైతులకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పత్తి పంట సాగు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షాలకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే పత్తి సాగుకు పెట్టుబడి పెరిగి కూలీలు దొరకక నిండా మునిగిన రైతులకు తాజాగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో మరింత కష్టాల్లో కూరుకుపోయినట్లు చెప్పారు.
స్లాట్ విధానంలో పత్తి అమ్మకానికి ముందే స్లాట్ బుక్ చేసుకోవడం, ఓటీపీ సమస్యలు, ఒక ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని, తేమ శాతం 8 నుండి 12 వరకు ఉంటేనే దిగుమతి చేసుకుంటామని పత్తి కేంద్రం వద్ద అధికారులు చెబుతుండడంతో ఏమి చేయాలో అర్థం కాక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో దళారులకు క్వింటా రూ.5 వేల నుండి రూ.6 వేలకు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. కావునా రైతులు గత సంవత్సరం మాదిరిగానే ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తిని సిసిఐ కొనుగోలు చేయాలని, తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని, పత్తి అమ్మకానికి స్లాట్ విధానాన్ని రద్దు చేసి రైతు ఇష్టమున్న కాటన్ మిల్లు వద్ద పత్తి అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.