న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) భారీ చోరీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ కూడా సుమారు 150 కోట్లు లూటీ చేసింది. నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ మనీ హెయిస్ట్ సిరీస్‌ను ప్రేరణగా తీసుకుని భారీ స్కెచ్ వేశారు ముగ్గురు వ్యక్తులు. ఆ థ్రిల్లర్ సిరీస్‌లో ఉన్న పేర్లనే వాళ్లు పెట్టుకున్నారు. అయితే పోలీసులు ఆ ముగ్గుర్నీ పట్టుకున్నారు. ఆ ముగ్గురూ ఆన్లైన్లో 23 కోట్లు లూటీ చేసినట్లు కూడా తెలిసింది.
మోసానికి పాల్పడిన ఆ గ్యాంగ్ సభ్యులను అర్పిత్, ప్రభాత్, అబ్బాస్‌గా గుర్తించారు. ఆ ముగ్గుర్నీ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని ఆ దొంగలు సోషల్ మీడియాలో యూజర్లకు ప్రామిస్ చేశారు. వెబ్ సిరీస్‌లో ఉన్న పాత్రల పేర్లను వాళ్ల వాడుకున్నారు. తమ వివరాలను దాచేందుకు ఈ రకంగా ప్రయత్నించారు.
అర్పిత్ ఓ లాయర్. కానీ అతను ప్రొఫెసర్‌గా పేరు మార్చుకుని మోసాలకు దిగాడు. కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రభాత్ వాజ్‌పేయి ఈ నేరం కోసం అమండాగా మారాడు. ఇక అబ్బాస్ తన పేరును ఫ్రెడ్డీగా మార్చుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అనేక సీక్రెట్ గ్రూపులను క్రియేట్ చేసి.. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని ప్రజలకు ఎర వేశారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లో డజన్ల సంఖ్యలో గ్రూపులను ఓపెన్ చేసి.. స్టాక్‌మార్కెట్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే భారీ రిటర్న్స్ వస్తాయని ప్రామిస్ చేశారు.
వాస్తవానికి ఆరంభంలో చిన్న చిన్న ప్రాఫిట్స్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా భారీ మొత్తంలో అమౌంట్ జమ చేస్తే, వాళ్ల అకౌంట్‌ను బ్లాక్ చేసేవాళ్లు. డబ్బును విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించేవాళ్లను మోసం చేసేవారు. మరింత డబ్బు డిపాజిట్ చేయాలని బెదిరింపులకు పాల్పడేవాళ్లు. ఈ పద్ధతుల్లో దేశవ్యాప్తంగా సుమారు 300 మందిని మోసం చేసింది ఆ గ్యాంగ్.
లగ్జరీ హోటళ్లలో బస చేస్తూ .. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో సైబర్ ఫ్రాడ్ కొనసాగించినట్లు పోలీసులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా యూపీలోని నోయిడా, బెంగాల్‌లోని సిలిగురిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసుతో లింకున్న 11 మొబైల్ ఫోన్లు, 17 సిమ్‌కార్డులు, 12 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్కులు, 32 డిబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ లావాదేవీలకు చెందిన స్క్రీన్ షాట్స్, వాట్సాప్ ఛాట్స్‌ను సీజ్ చేశారు.
ఈ లూటీ కేసులో చైనా కనెక్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాన్జాక్షన్స్, కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ లాగ్స్ ద్వారా ఆ గ్యాంగ్‌కు నోయిడా, గౌహతిలో లింకులు ఉన్నట్లు తేల్చారు. ఈ ఫ్రాడ్‌లో కొందరు చైనీయులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇదే గ్యాంగ్ ఆన్లైన్లో వేర్వేరు పద్ధతుల్లో 23 కోట్లు లూటీ చేసినట్లు గుర్తించారు. సైబర్ నేరంలో చైనా నేరగాళ్ల నెట్వర్క్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాంగ్‌తో లింకున్న ఇతర వ్యక్తులు, విదేశీ నెట్వర్క్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.