నల్లగొండ, నవంబర్ 4: మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేస్తామని పోటీ పడి సీసీఐ కేంద్రాలు ప్రారంభించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆయా కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తున్నదీ లేనిదీ వెనక్కి తిరిగి చూడకపోవటంతో ఆరంభ శూరత్వంగానే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 జిన్నింగ్ మిల్లులను గుర్తించిన అధికారులు వాటిలో ఎల్-1కింద మొదట తొమ్మిది కేంద్రాలను స్థానిక శాసన సభ్యులతో పక్షం రోజుల కింద ప్రారంభించారు. అయితే ఈ పక్షం రో జుల్లో ఇప్పటి వరకు కొన్నది మొత్తం 4400 క్వింటాళ్లే కావటం గమనార్హం. కొనగోళ్లకు తేమ శాతం ప్రధాన అడ్డంకిగా ఉంటే, కపాస్ కిసాన్ యాప్ కూడా రైతులకు గుదిబండగా మారింది. దాంతో పత్తిరైతులు సీసీఐని వదిలి ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మొత్తంగా పత్తి మూడు పికింగ్స్లో పూర్తి కానుండగా ఇప్పటికే తొలి పికింగ్ పూర్తి కావడం..అది కూడా పూర్తిగా ప్రైవేటు వ్యాపారులే కొనటం గమనార్హం. అదీనూ క్వింటాకు రూ.5500 నుంచి రూ.6200 వరకు మాత్రమే వెచ్చించి వ్యాపారులు కొన్నారు.
అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి..
జిల్లాలో గత ఏడాది లాగానే ఈ సారి కూడా పత్తి సాగు 5.50 లక్షలకు పైగానే అయినప్పటికీ ఉత్పత్తి మాత్రం తక్కువగా వచ్చిందని రైతులు అంటున్నారు. గత ఏడాది తక్కువ వర్షాలు పడటంతో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి చేతికి రాగా ఈ సారి 6 నుం చి 8 క్వింటాళ్లే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే 25 శాతం పంట చేతికి రాగా రెండో పికింగ్‌లో మరో 70 శాతం దాక రానుంది. ఇది కాస్త క్వాలిటీగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం కురిసే వర్షాల వల్ల మరో 20 రోజుల వరకు పత్తి ఏరే అవకాశం ఉండదు. అంటే చేను మీద ఉండే పత్తిలోనూ క్వాలిటీ తగ్గటంతో పాటు ఇప్పటికే ఇంట్లో ఉన్న పత్తి అధిక వేడితో రంగు మారే అవకాశం ఉంటుందని అం టున్నారు. దాంతో పత్తిని సీసీఐ నిబంధనల ప్రకారం విక్రయించలేమని మళ్లీ ప్రైవేటు వ్యాపారులకే ఎంతోకొంతకు అమ్మాల్సిందేనని రైతులు అంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యాపారులు తూకాల్లో మోసం చేస్తున్న ఘటనలు కనిపిస్తున్నా తూనికల కొలతల శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

4400 క్వింటాళ్లు కొనుగోలు
నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 5.72 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 23 జిన్నింగ్ మిల్లులను గుర్తించి వాటిల్లో ఎల్-1 కింద ఉన్న తొమ్మిది కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించాం. ఇప్పటి వరకు 4400 క్వింటాళ్లు కొన్నాం. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12శాతం ఉండటంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తెస్తే కొంటాం.
– ఛాయాదేవి, మార్కెటింగ్ ఏడీ, నల్లగొండ
పోటీలు పడి ప్రారంభించిన ఎమ్మెల్యేలు..
జిల్లాలో ప్రస్తుత వానకాలం సీజన్లో 5 68 778 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 5 72 395 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి కానుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లులను గుర్తించి వాటిల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిని ప్రారంభించేందుకు అధికార పార్టీ శాసన సభ్యులు పోటీ పడ్డారు. అయితే అవి ప్రారంభించి పక్షం రోజులైనా నేటికి ఆ సెంటర్లల్లో మాత్రం 4400 క్వింటాళ్లనే కొనుగోలు చేయడం గమనార్హం. సీసీఐ కేంద్రాలు ప్రారంభించిన తర్వాత అక్కడ కొనుగోళ్ల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యేలతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 8 నుంచి 12 శాతం లోపు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం నిత్యం వర్షాలు పడుతుండటంతో తేమ వచ్చే పరిస్థితి లేకపోవటంతో కేంద్రాల్లోకి రైతులు పత్తిని తేలేకపోవటం ఒక కారణమైతే…కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే పత్తి తేవాలనే నిబంధన రైతులను ఇబ్బంది పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు లేని రైతులతో పాటు ఫోన్లు ఉన్నా యాప్‌పై కనీస అవగాహన లేని వారు సీసీఐ కేంద్రాల దరిదాపుల్లోకి రావటం లేదు.
25 శాతం పత్తి ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి..
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 5.72 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రావాల్సి ఉండగా ఇప్పటికే 25శాతం అంటే సుమారు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి తొలి పికింగ్ కింద రైతులు ఏరినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో తొలి పికింగ్ ప్రారంభం కాగా మొత్తంగా వచ్చే 1.45లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఏరితే అందులో సీసీఐ 4400 క్వింటాళ్లే కొన్నది. అంటే తొలి పికింగ్ పత్తి మొత్తం ప్రైవేటు వ్యాపారులే కొన్నట్లు స్పష్టమైంది. సీసీఐ అయితే క్వింటాకు రూ.8110 ఇస్తుండగా ప్రైవేటు వ్యాపారులు మాత్రం మైల పత్తి అని..ఇప్పట్లో సీసీఐ కేంద్రాలు ఓపెన్ కావని…అయినా తేమ 12 శాతం లోపే ఉండాలంటూ రైతులను డైలమాలో పడేసి క్వింటాకు రూ.5500 నుంచి రూ.6200 వరకు మాత్రమే నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు కొన్న పత్తిని ఎప్పటికప్పుడే వరంగల్, జనగాం జిల్లాలతో పాటు ఆంధ్రాలోని గుంటూరుకు తరలించి విక్రయిస్తున్నారు.