ఖమ్మం వ్యవసాయం/పెద్దపల్లి జంక్షన్/గజ్వేల్/కాశీబుగ్గ, డిసెంబర్ 28: పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగ డం, ఆన్లైన్ బిడ్డింగ్‌లో వ్యాపారులు పోటీపడటంతో రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో మంగళవారం పత్తికి రికార్డుస్థాయి ధరలు నమోదయ్యాయి. ఖమ్మం మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.9 వేలు పలికింది.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ.8,833 ధర వచ్చింది. ఈ మార్కెట్ చరిత్రలోనే పత్తికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజు పృథ్వీరాజ్ తెలిపారు. గజ్వేల్‌లో క్వింటాల్ రూ. 8,819 ధర పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ మహిపాల్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సీజన్లో తొలిసారి రికార్డు స్థాయి లో క్వింటాల్‌కు రూ.8,715 పలికింది.