హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖలో ఒక ఫైల్ కదలాలంటే ముడుపులు ముట్టందే పనికాని పరిస్థితి నెలకొన్నది. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సెక్షన్లో అవినీతి రాజ్యమేలుతున్నట్టు తెలుస్తున్నది. ఒక భూమికి సంబంధించిన సర్వే రిపోర్టు ఇవ్వడానికి లక్షన్నర డిమాండ్‌చేసి, వారంరోజుల క్రితం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ 50వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అర్చక సిబ్బందికి సంబంధించిన ఫైళ్లతో పాటు పనుల విషయంలో పలువురు ఈవోలు ఇదేరీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫైల్ కదలాలంటే..
రాష్ట్రవ్యాప్తంగా 686 ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి ఫైల్ కదలాలన్నా ఒక్కో టేబుల్‌కు ఒక్కో రేటు ఫిక్స్ అయి ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్‌ను కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్న సమయంలోనే ప్రధాన దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలు చూసే ఒక ఉద్యోగి ఉత్తరతెలంగాణలోని ఓ ప్రధాన ఆలయానికి సంబంధించిన ఉద్యోగి ఫైల్‌ను మరో సెక్షన్‌కు పంపడానికి రూ. 10 వేలు తీసుకున్నారని సమాచారం. కార్యాలయం వెనక వైపు ఉన్న హోటల్లో తనకు నమ్మకమున్న మరో ఉద్యోగి ద్వారా ఆ సీనియర్ అసిస్టెంట్ డబ్బులు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముడుపులు చెల్లిస్తేనే కమిషనర్ పేషీ వరకు ఫైల్ చేరుతుందని దేవాదాయ శాఖ సిబ్బందే చెప్పుకుంటున్నారు. ఇటీవల మంత్రి పేషీకి సంబంధించిన ఓ అధికారి పంపించిన ఫైల్ సైతం మూలకు పడిందని, దీనిపై ఆ అధికారి ఏం జరిగిందని ఆరా తీస్తే ఈ బాగోతం తెలిసి అవాక్కయినట్టు సమాచారం.
ఫిర్యాదు చేసినా చర్యలేవి!
ఈ ముడుపుల బాగోతం ఏ ఒక్క సెక్షన్‌కో పరిమితం కాలేదు.. ఆ శాఖలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు ప్రతీ చోటా ఇదే దందా నడుస్తున్నదని, ముఖ్యమైన విభాగాలు చూసే అసిస్టెంట్లలో కొందరు ఉద్యోగుల కారణంగా మొత్తం శాఖకే చెడ్డ పేరు వస్తున్నదంటూ ప్రధాన కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఒక కాంట్రాక్టర్ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఉద్యోగులైతే సిండికేట్‌గా మారి ఏకంగా శాఖలో కమిషనర్ పేషీ వరకు మొత్తం వ్యవహారం నడుపుతున్నట్టు దేవాదాయశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని పథకాల దరఖాస్తు ఫైల్ పెట్టింది మొదలు పూర్తయ్యే వరకు అడుగడుగునా డబ్బులు సమర్పించుకోవాల్సిందేనని ఉద్యోగులే బాహాటంగా విమర్శిస్తున్నారు.
ఆ ముగ్గురు ఉద్యోగులపై సోషల్‌మీడియాలో వైరల్ అయినా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినా వారి తీరు మారలేదు సరికదా.. తమ వ్యవహారం బయటపడిందనే నెపంతో ముడుపుల దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొందరు కార్యాలయ పరిసరాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లు, హోటళ్లలో కౌంటర్లు తెరిచారని సిబ్బందే చెప్పుకుంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన అధికారుల వ్యవహారంతో పాటు పలువురు ఉద్యోగుల అవినీతిపై ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. మంత్రి పేషీ వరకు వీరి అక్రమాల బాగోతాలు తెలిసినా తమకున్న పరపతితో ఈ ఫిర్యాదులను తొక్కిపెట్టించి దర్జాగా తిరుగుతున్నారనే చర్చ జరుగుతున్నది.
ఆ కంప్యూటర్లు ఎక్కడివి?
ప్రధాన కార్యాలయంలో ఉన్న కొన్ని కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు ఎక్కడి నుంచి తెప్పించారనే కోణంలో పెద్ద చర్చ జరుగుతున్నది. అసలు ఈ కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రి ఏ దేవాలయం నుంచి కార్యాలయానికి తరలించారోనని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఇవన్నీ స్థానిక దేవాలయాల నుంచి తెప్పించి వాటి బిల్లులను తమ సెక్షన్ బిల్లులనుంచి తీసుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు. బొగ్గులకుంటలోని కమిషనరేట్‌లో ఏ వస్తువు కావాలన్నా నగరంలోని ప్రధాన దేవాలయాల నుంచి తెప్పించడం పరిపాటిగా మారిందని ఎండోమెంట్ ఉద్యోగులే చెబుతున్నారు. సెక్షన్లో ఉపయోగించే ప్రతీ వస్తువు బయటనుంచే తెప్పించి వాటికి సంబంధించిన బిల్లులను తమ సెక్షన్ల ఖర్చులో చూపిస్తున్నట్టు ఒక సీనియర్ ఉద్యోగి చెప్పారు. నిరుడు ఆడిటింగ్ జరిగిన సమయంలో ఇటువంటి కొన్ని అంశాలను ఆడిటర్లు లేవనెత్తారని, కానీ ఉద్యోగుల దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో వారు రిమార్కులు రాసినట్టుగా ఆ సీనియర్ ఉద్యోగి పేర్కొన్నారు.