ధన్వాడ : మన ఊరు- మనబడి పథకం కింద పాఠశాల మరమ్మతు ( School repair ) పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్య( Suicide) తప్పదని ఓ కాంట్రాక్టర్ ( Contractor ) ఏకంగా ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లి తండాకు చెందిన సురేష్ నాయక్ మన ఊరు మనబడి పథకం కింద తండాలోని పాఠశాల మరమ్మతులకు రూ. 5.25 లక్షలు ఖర్చుచేశాడు. ఇందులో రూ. 3 లక్షలు ఇది వరకే మంజూరుకాగా మరో రూ. 2 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తనకు పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని వాపోయాడు.
మండలంలోని మందిపల్లి పాత తండాకు చెందిన సురేష్ నాయక్, విద్యా కమిటీ చైర్మన్ రాజు నాయక్తో కలిసి బుధవారం స్థానిక ఎంఈవో గాయత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. తన భార్య వద్ద ఉన్న మూడు తులాల బంగారాన్ని కుదువబెట్టి మరమ్మతు పనులు చేశానని , ఇంతవరకు బిల్లు రాక అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని లేఖలో వాపోయాడు.