హుజూరాబాద్, మార్చి 22 : హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి గ్రామపరిధిలో ఏర్పాటు చేయనున్న డంప్ యార్డ్డు (వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్) వద్దే వద్దని అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు, నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆదివారం పట్టణంలోని ఓ కన్వెన్షన్‌లో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రిటైర్డ్ టీచర్ పల్కల ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ, డంప్ యార్డు ఏర్పాటు చేస్తే సమీప ప్రాంతాలు కాలుష్యం కోరల్లో చికుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ వెదజల్లే విషపూరిత కాలుష్యం వల్ల సిర్సపల్లి, హుజూరాబాద్ పట్టణంతోపాటు మండలంలోని చాలా గ్రామాల ప్రజల జీవనానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలతో పాటు సమస్త ప్రాణకోటికి ప్రాణహాని ఉంటుందని తెలిపారు.
అలాగే, వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం అవుతాయని, ఇంతటి ప్రమాదకర పరిస్థితిని సంఘటితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందన్నారు. అవసరమైతే ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని 20 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని, అదేవిధంగా మున్సిపాలిటీలోనూ తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. సోమవారం నుంచి సిర్సపల్లితోపాటు సమీప గ్రామాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని, అలాగే ప్రజాప్రతినిధులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వినతి పత్రాలు అందించి డంప్ యార్డ్ రద్దు కోసం కృషి చేయాలని నిర్ణయించారు. హైకోర్టును ఆశ్రయించే విషయంపైనా సమాలోచనలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, కుల, వృత్తి, వ్యాపార, వాణిజ్య, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
డంప్ యార్డ్ రద్దుకు నా వంతు కృషి చేస్తా. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తా. అఖిలపక్ష కమిటీ తీసుకునే నిర్ణయాలలో పాలుపంచుకుంటా.
డంప్ యార్డ్ ఏర్పాటును అడ్డుకునే పోరాటంలో ముందుంటా. భవిష్యత్ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా. డంప్ యార్డ్ ఏర్పాటుతో ప్రజల ప్రాణాలకు ముంపు పొంచి ఉంది. అఖిలపక్ష కమిటీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుండి పోరాడుతా.
డంప్ యార్డు వల్ల సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. దీని ప్రభావం పంట పొలాలపైనా ఉంటుంది. ఫలితంగా దిగుబడి పడిపోతుంది. భూసారం తగ్గి కొన్నేండ్లకు పంటలు పండే పరిస్థితి ఉండదు. ప్రమాదకరమైన వాయువులు వెలువడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. చెత్తను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
సిర్సపల్లి గ్రామపరిధిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న డంప్ యార్డు ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎనర్జీ ప్లాంట్ నుంచి వెలువడే విష వాయువులతో మానవజాతి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలి. అఖిలపక్ష కమిటీ తీసుకునే నిర్ణయాల్లో పాలుపంచుకుంటా.