హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్ఐటీలు సహా కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2 సిటీ ఇంటిమేషన్ స్లిప్ (ఏ సిటీలో పరీక్ష రాయనున్నారో తెలిపే) విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ స్లిప్‌ను ఆన్లైన్లో పొందుపరిచింది. సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 2,4,5,6,8 తేదీల్లో పేపర్-1 (బీఈ, బీటెక్) పేపర్లకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7న పేపర్ 2ఏ(బీ ఆర్క్), 2బీ(బీ ప్లానింగ్) పేపర్లకు పరీక్షలుంటాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలోనూ పరీక్షలు జరుగుతాయి. మెయిన్-2 సెషన్‌కు ఈ ఏడాది 10.61లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. జనవరిలో జరిగిన సెషన్-1 పరీక్షకు 13.11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. సెషన్-1కు రాసిన వారిలో అత్యధికులు సెషన్-2కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పరీక్షల్లో ఏ పరీక్షలో ఎక్కువ మార్కులొస్తే.. వాటినే లెక్కలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు.