తిరుమల : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుసగా వచ్చిన సెలవుల కారణంగా తిరుమల (Tirumala) దివ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం, శుక్రవారం శ్రావణ శుక్రవారం, సాఫ్ట్వేర్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం , ఆదివారం సెలువు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు (Compartments) భక్తులతో నిండి అతిథి గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 18-24 గంటల వరకు సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 77,807 మంది దర్శించుకోగా 38,340 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
రేపు శ్రావణ పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీన శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ (Garuda Seva) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు.