నిలువెల్ల అగ్రవర్ణ దురహంకారాన్ని నింపుకొని ‘బీసీల కోసం అది చేస్తున్నాను.. ఇది చేస్తున్నాను’ అంటున్న సీఎం రేవంత్ చిత్తశుద్ధి నెమ్మదిగా తేటతెల్లమవుతున్నది. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ విజయోత్సవానికి సన్నాహాలు చేస్తున్నది. ఆ సభకు రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించాలని ఏర్పాట్లు చేస్తుండటం చూస్తుంటే నవ్వొస్తున్నది. ‘ఏం సాధించారని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నరు?’ అన్న ప్రశ్నలకు సమాధానమే లేదు.
బీసీ కోటా తేలనే లేదు. ఎన్నికల నిర్వహణ ఊసే లేదు. కానీ, అప్పుడే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేసినట్టు, అమలైపోయినట్టు విజయోత్సవ సభలు పెట్టడం హాస్యాస్పదం. తెలంగాణలో బీసీ కోటా వచ్చిందా? 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతున్నయా? ఇటీవలి వైన్ షాపు టెండర్లలో బీసీ కోటా ఎంత? మంత్రివర్గంలో, కార్పొరేషన్ పదవుల్లో, పోనీ పార్టీ పదవుల్లో బీసీలకు ఎంత శాతం పదవులిచ్చారు? సీఎంవోలో బీసీ ఉద్యోగుల సంఖ్య ఎంత? ఆర్టీఏలో బీసీ కమిషనర్లెందరు? బీసీ వాదన పెరిగే కొద్దీ గుట్టుచప్పుడు కాకుండా ఉన్నత వర్గాల కోసం ఇచ్చిన చీకటి జీవోలెన్ని? సీఎం నుంచి మొదలుకొని వివిధ శాఖల అధిపతుల వరకు లెక్కలు తీస్తే బీసీలు కనీసం 10 శాతం కూడా లేకపోవడం దుర్మార్గం.
ఏ రాష్ట్రమైనా ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లిందా? చట్టబద్ధత లేని ఆర్డినెన్స్‌లు కోర్టుల్లో నిలబడవని తెలిసినా రేవంత్ ప్రభుత్వం మొండిగా ఎందుకు ముందుకెళ్తున్నది? ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లను ఆపితే, అప్పుడు బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే రేవంత్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకున్నారు! సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నిక లు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించిన దరిమిలా సీఎం రేవంత్ మొండిగా, ఉన్నపళంగా ఎన్నికలు నిర్వహించాలన్న పంతంతో ఉంటే, రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని మిగతా మంత్రులు భీష్మించుకు కూర్చున్నారు. అటు సీఎం, ఇటు మంత్రుల నడుమ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారుతున్నది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం గవర్నర్, రాష్ట్రపతికి బిల్లులు పంపి ఐదు నెలలైంది. లోపభూయిష్టంగా ఉండటంతో ఆ బిల్లులు ఆమోదానికి నోచుకునే అవకాశమే లేదు. జీవో తెచ్చి ఎన్నికలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నా అదీ సాధ్యపడదు. రాజ్యాంగబద్ధ ప్రామాణికత లేకుండా క్యాబినెట్ ఆమోదిస్తే న్యాయస్థానాలు ఊరుకుంటయా? రాజ్యాంగ నిబంధనల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ముందుగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అనంతరం అది మంత్రివర్గం ముందుకురావాలి. దీనిపై చర్చ జరిగిన అనంతరం ఆమోదించాలి. కానీ, ఇప్పటి వరకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రజల ముందు పెట్టనేలేదు. పైగా బీసీ కమిషన్‌కు, డెడికేటెడ్ కమిషన్‌కు ఒక్కరినే చైర్మన్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెప్తున్నారు. నిజానికి రాష్ర్టాలు చేసే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. అలాంటి చెల్లుబాటు కాని కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం.. రిజర్వేషన్లను పూర్తిగా ఎగ్గొట్టే కుట్ర తప్ప మరోటి కాదని బీసీ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా మసిపూసి మారేడుకాయ చేస్తున్న కాంగ్రెస్ ఏం సాధించిందని సభ పెడుతున్నదో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్‌లోని ఒక్క అంశాన్నీ నెరవేర్చని కాంగ్రెస్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కామారెడ్డికి కదం తొక్కి ఆ పార్టీని నిగ్గదీసి నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అంబేద్కర్ బాటలో రిజర్వేషన్లపై మరో పోరు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాక్కొనే ప్రయత్నాన్ని ఎండగట్టాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు బీసీలు బుద్ధిచెప్పడమే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి గోరీ కట్టడం ఖాయం. స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధంగా లేరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి, సీఎంకు ఎంత మాత్రం ఇష్టం లేదన్నది సుస్పష్టం. అందుకే బీసీ రిజర్వేషన్లపై డ్రామాలాడుతున్నారు.
(వ్యాసకర్త: న్యాయవాది,బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
– శుభప్రద్ పటేల్
97010 69698