హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో గత ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు ఒక్క సీజన్‌కే హైదరాబాద్‌లో రూ.700 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిర్వాహకుల అంచనాల ప్రకారం ప్రత్యక్షంగా, పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటనలు, మీడియా కవరేజీ ద్వారా వందల కోట్ల లాదేవీలు జరిగినా.. ఆ విషయాన్ని పక్కనపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే అంతటి ప్రతిష్టాత్మకమైన రేసును రద్దు చేసుకుందని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. పలు దేశాలు, రాష్ట్రాల నుంచి 35 వేల మందికిపైగా హైదరాబాద్ వచ్చి ఆ రేస్‌ను వీక్షించారు. భారతదేశంలో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన మొదటి నగరంగా హైదరాబాద్ ఘనత సాధించింది. ఆ ఒక్క రేస్‌తోనే ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ నిలిచింది. ఇప్పటివరకు లండన్, బీజింగ్, సియోల్, మాసో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి ఎన్నో ప్రముఖ నగరాల్లో వందకు పైగా ఫార్ములా ఈ-కారు రేసులు జరిగాయి.
ఫార్ములా-ఈ కార్ల రేస్ వల్ల అనేక లాభాలు ఉండటం వల్లనే గత ప్రభుత్వం పర్యావరణహితమైన ఈ రేస్‌ను తెలంగాణకు పరిచయం చేసింది. గతంలో ఫార్ములా-ఈ రేస్ జరిగిన ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు 700 శాతానికి పైగా పెరిగిందని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. పలు సీజన్లలో సుమారు రూ.50 కోట్ల మంది ఈ పోటీలను వీక్షించగా.. ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ పెరగడంతోపాటు పర్యాటక ఆదాయం కూడా పెరిగి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించింది. ఇది నెట్ జీరో కార్బన్ ఘనత సాధించిన మొదటి క్రీడ కావడంతో పర్యావరణ ప్రేమికులు ఈ-కార్ రేసులను ప్రోత్సహించారు. మెక్ లారెన్, నిస్సాన్, జాగ్వార్, మహీంద్రా, టీసీఎస్ వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు ఈ రేసుల్లో ప్రతిష్టాత్మక భాగస్వాములుగా పాల్గొన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి 2023లో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌తో తెలంగాణలోనూ భారీగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరిగాయి.
అధికారానికి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ఫార్ములా-ఈ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. 2024లో హైదరాబాద్‌లో జరగాల్సిన రేస్‌ను ఏకపక్షంగా నిలిపివేసింది. ఫార్ములా-ఈ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌తో రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు మసకబారాయి. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో ఉన్న ఒక చిన్న టెక్నికల్ అంశాన్ని పట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులకు అధికారులు విడుదల చేసిన డబ్బుపై నాటి నుంచి రాద్ధాంతం చేస్తున్నది. కేసీఆర్, కేటీఆర్‌ను ఎలాగైనా ఇరుకున పెట్టాలనే దురుద్దేశంతో బ్యాంకు నుంచి మరో బ్యాంకునకు లావాదేవీలు అధికారికంగానే జరిగినా.. అందులోనూ తప్పులు వెతికించింది. ఆఖరికీ జాతీయ దర్యాప్తు సంస్థలనూ రంగంలోకి దింపించింది. ఎలాంటి అవీనితి జరగకపోయినా కేసులతో ఇబ్బంది పెడుతున్నది. చివరికి కేటీఆర్‌ను ఎలాగైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ అనుమతి సైతం తీసుకున్నది. ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ పలుమార్లు మీడియాకు వెల్లడించారు. జరిగిన వాస్తవాలను అన్నీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. బాధ్యతగల పౌరుడిగా ఏసీబీ, ఈడీ విచారణకు హాజరై.. పూర్తిగా సహకరించారు. అయినా.. అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికే ముందువరుసలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పెంచడానికి, ప్రపంచవ్యా ప్త గుర్తింపు తేవడానికి అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని పదేపదే చెప్పారు కూడా. ఈ క్రమంలోనే రాబోయే సీజన్లలో మరిన్ని రేసులు నిర్వహించేందుకు ఫార్ములా ఈ నిర్వాహకులతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒ ప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫా ర్ములా ఈ రేస్ నిర్వాహకులను ఆకర్షించాయి. వరుసగా ఐదుసార్లు హైదరాబాద్ అత్యంత జీవనయోగ్యమైన నగరంగా గుర్తింపు పొంద డం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్-2022 గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొకలు నాటడం, తెలంగాణవ్యాప్తంగా గ్రీన్ కవర్‌ను పెంచడంతో ఫార్ములా ఈ-కార్ రేసు హైదరాబాద్‌కు వచ్చింది.