రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీతో సిరిసిల్ల జిల్లా ఆటో డ్రైవర్లు ఆనందపడుతున్నారు. జిల్లాలోని 5వేల మంది ఆటోవాలాలకు 5లక్షల బీమా పాలసీ డబ్బులు తానే స్వయంగా చెల్లిస్తానని ఇటీవల ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటోవాలాలకు ‘నేనున్నానంటూ’ రామన్న అండగా నిలువడంతో ‘థాంక్యూ సర్’ అంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. రెండో రోజు గురువారం సిరిసిల్లలోని నేతన్న చౌరస్తాతోపాటు గంభీరావుపేటలో రామన్న ప్లెక్సీలకు పాలాభిషేకం చేసి తమ అభిమానం చాటుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, జిల్లా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు బొల్లి రాంమోహన్ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోలకు ఉన్న ట్యాక్స్‌లు మాఫీ చేసిందని, ప్రతి కార్మికుడికి 5లక్షల బీమా చేయించి భరోసానిచ్చిందని కొనియాడారు. కానీ, నేడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉన్న బీమా సౌకర్యాన్ని తొలగించిందని, ప్రతి కార్మికుడికీ 12వేలు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి తప్పారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 161 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంకెంత మంది చస్తే స్పందిస్తారంటూ నిలదీశారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు 20లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, సలీం, దోర శ్రీనివాస్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.