జగిత్యాల, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎంతో గోప్యంగా నిర్వహించాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ బయటకు పొక్కినట్టు తెలుస్తున్నది. దీంతో ఏయే స్థానాలు ఏ వర్గాలకు రిజర్వు అయ్యాయో ముందే తెలుసుకున్న అధికార పార్టీ నేతలు రిజర్వేషన్ల ప్రక్రియ తామనుకున్న రీతిలో జరగలేదని అధికారులపై మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని తమ నాయకులకు తెలుపడంతో ఓ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి లేఖ రాస్తూ రిజర్వేషన్లను తిరిగి కేటాయించాలని కోరినట్టు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఈ మేరకు ఓ మెయిల్ పంపినట్టు సమాచారం. కరీంనగర్‌తో పాటు, జగిత్యాల జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదన్న ఎమ్మెల్యే దీనివల్ల బడుగు, బలహీనవర్గాల వారికి అన్యా యం జరుగుతుందని పేర్కొన్నట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని క్యాటగిరీల రిజర్వేషన్లు నిర్వహించి సీల్డ్ కవర్లో అందించాలని, అలాగే రిజర్వేషన్ల వివరాలను గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మే రకు అన్ని జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు సంబంధించిన రిజర్వేషన్ల కోటాను జనాభా ఆధారంగా రూపొందించారు. ఒకవైపు అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్న సమయంలోనే మండల స్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తమ మండలంలో జడ్పీటీసీ, ఎంపీ పీ, ఎంపీటీసీల స్థానాలు, సర్పంచ్ స్థానా లు ఏ క్యాటగిరీకి రిజర్వు అవుతున్నాయన్న వివరాలను తెలుసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.