సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం గ్రేటర్లో వరుసగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం గొంతునొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హెచ్3ఎన్2 ఉప రకానికి చెందిన ఇన్ఫ్లూయంజా బాధితులే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపారు.
వరుసగా కురుస్తున్న వానలతో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురై దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఫలితంగా బస్తీ దవాఖానల దగ్గర నుంచి ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా దవాఖానలతో పాటు కోరంటి, గాంధీ, ఉస్మానియా తదితర పెద్ద దవాఖానల్లో సైతం ఫ్లూ బాధిత రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో గ్రేటర్‌లోని ప్రభుత్వ దవాఖానలకు వచ్చే కేసుల్లో 70 శాతం కేసులు ఫ్లూ, వైరల్ ఫీవర్‌కు సంబంధించినవే అని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఫీవర్ హాస్పిటల్లో ఓపి కేసుల సంఖ్య సాధారణం కంటే 20శాతం, ఉస్మానియాలో 12శాతం, గాంధీలో 15శాతం, బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా దవాఖానల్లో ఓపి కేసులు 25 నుంచి 30 శాతానికి పెరిగినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
వర్షాకాలం, చలికాలంలో వచ్చే సీజనల్లో ఇన్ఫ్లూయంజా అనేది సర్వసాధారణమైన వైరస్. ఇది ఎవరికైనా వచ్చిపోతుంది. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. జలుబు, జ్వరం వంటి లక్షణాల కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, సరైన చికిత్స చేయించాలి.
– డాక్టర్ రమేశ్ దాంపురి, నిలోఫర్ రిటైర్డ్ వైద్యులు