అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నైని బొగ్గు స్కామ్‌తో కాంగ్రెస్‌లో మొదలైన కాక.. క్రమంగా దావానలంలా మారుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ తీరుతో ఇన్నాళ్లు లోలోన రగిలిన ‘అసలు కాంగ్రెస్’ మంత్రులు ఇప్పుడిక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లిన తరుణంలోనే.. పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉండగానే.. రాష్ట్రంలో ఉన్న నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం సంచలనం రేపుతున్నది. సోమవారం ఎట్‌హోం విందు తర్వాత భట్టి నివాసంలో ఉత్తమ్, దుద్దిళ్ల, అడ్లూరి లక్ష్మణ్ సమావేశం కావడం కీలకంగా మారింది.
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని నలుగురు కీలక మంత్రులు ఒకచోట కూడటం సంచలనంగా మారింది. పాలనా పరమైన నిర్ణయాల కోసమో.. ప్రభుత్వ పథకాల అమలుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో వీరంతా సభ్యులు కాదు.. నికార్సయిన కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తెలంగాణ మంత్రులు నలుగురు సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు.
విశ్వసనీయ సమాచారం మేరకు భట్టి అధికార నివాసంలో భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైనట్టు సమాచారం. సుమారు రెండున్నర గంటలకుపైగా నలుగురు మంత్రులు మాత్రమే సమావేశమయ్యారు. వాస్తవానికి సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో
పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిశాక సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, అడ్లూరి ఒకే కారులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తున్నది.
వీరు నలుగురూ సుదీర్ఘంగా పొద్దుపోయే వరకు సమావేశం కావడం, భేటీ మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కూడా జాయిన్ కావడం చర్చనీయాంశమైంది. వీరి భేటీ సందర్భంగా ప్రధానంగా సింగరేణి బొగ్గు స్కామ్, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాలపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ కథనాలు, వాటి వెనుకున్న శక్తుల గురించి కూలంకశంగా చర్చించినట్టు విశ్వసనీయ సమాచా రం. అయితే వీరి అత్యవసర భేటీకి కారణం ఏమిటి? అనే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం.
చంద్రబాబు మాయలో పడి రేవంత్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, మొదటి నుంచీ పార్టీనే తల్లిగా భా వించి నమ్ముకొని ఉన్నవారిని వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేలా, వ్యక్తిత్వాలను హ ననం చేసేలా వ్యవహారాలు చేస్తున్నారని సీనియర్ మంత్రుల మధ్య చర్చకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉద్దేశపూర్వకంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎగేసి సింగరేణి టెండర్లకు సంబంధించిన వ్యవహారాలను ఆంధ్రజ్యోతికి అందించారని మంత్రుల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భట్టికి విభేదంలో రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ సీనియర్ మం త్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు మంటగలిసేలా లీకులు ఇస్తున్నారని, ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని ,దీనికి చెక్ పెట్టకపోతే పార్టీగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా నష్టపోతామని, ఇక భవిష్యత్తులో కోలుకోలేమని వారు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన జీవన్‌రెడ్డి వంటి సీనియర్లను గౌరవించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే భావన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కాగా.. మంత్రుల భేటీపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క రాష్ట్రంలో పరిపాలన విషయంపై మంత్రులతో సమావేశమయ్యారని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక పార్టీ హైకమాండ్‌తో చర్చిస్తామని తెలిపారు. ఢిల్లీలో పీసీసీ చీఫ్‌లతో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రుల అత్యవసర భేటీపై ఆయన వద్ద సమాచారం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
నలుగురు మంత్రులు సుదీర్ఘంగా భేటీ అవడం కాంగ్రెస్‌లో కలవరం సృష్టించింది. పార్టీ, ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తి నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. ముఖ్యమంత్రి తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఏం చర్చించారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
మరోవైపు రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో ఆరా తీసింది. రాష్ట్ర నేతలకు ఢిల్లీ నుంచి మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ పెద్దల మనోగతాన్ని వివరించినట్టు తెలిసింది. అయితే, పార్టీ అధిష్ఠానానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, బొగ్గు స్కామ్, టెండర్ల విధానంలో చేసిన మార్పులు తదితర అంశాల గురించి రెండు రోజుల క్రితం మెయిల్ వెళ్లినట్టు సమాచారం. ఆ మెయిల్ సారాంశంపై మంత్రుల భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. దానికి సమాధానం పంపే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. పార్టీ అధిష్ఠానానికి ఒక మెయిల్‌ను కూడా ఈ సందర్భంగా పంపినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.